logo

చేతిపంపు అక్కరొచ్చె..!

నీరు లేకుంటే ఏ జీవి కూడా మనుగడ సాధించలేదు. ఒక పూట ఆహారం లేకపోయినా ఉండొచ్చు కానీ.. నీరు లేకుంటే మాత్రం కష్టతరమవుతుంది. ప్రస్తుత వేసవిలో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Updated : 13 Apr 2024 05:48 IST

కనకల్‌ మండలం రామచంద్రాపురంలో మరమ్మతు చేయడంతో నీరు పోస్తున్న చేతిపంపు

భానుపురి, మేళ్లచెరువు, భువనగిరి, న్యూస్‌టుడే: నీరు లేకుంటే ఏ జీవి కూడా మనుగడ సాధించలేదు. ఒక పూట ఆహారం లేకపోయినా ఉండొచ్చు కానీ.. నీరు లేకుంటే మాత్రం కష్టతరమవుతుంది. ప్రస్తుత వేసవిలో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పెరగుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలతో ప్రజలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో నీటి ఎద్దడి నివారణపై దృష్టిసారించింది. పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడ కూడా మంచినీటి ఇక్కట్లు ఎదురుకాకుండా గతంలో వాడిన చేతి పంపులను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో అధికారులు పట్టణాలు, గ్రామాల్లోని చేతిపంపులను మరమ్మతు చేపట్టి వినియోగంలోకి తెస్తున్నారు.

 ఉమ్మడి జిల్లాలో 5,724

 ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 5,724 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో 95 పంపులకు మరమ్మతు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వ నుంచి ఆదేశాలు రావడంతో వెంటనే అధికారులు గ్రామాలు, పట్టణాల్లోని చేతిపంపులపై దృష్టిసారించారు. వెంటనే సిబ్బందితో మరమ్మతు చేయించారు. ప్రస్తుత వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి ఇంట్లో బోర్లు కూడా పోసే పరిస్థితి లేకుండా పోయింది. నీటి ఇక్కట్లు తీర్చడానికి ప్రభుత్వం చేతిపంపులను వినియోగంలోకి తేవాలని ఆలోచన చేసింది. దీంతో పల్లెపట్టణాల్లో తుప్పుపట్టి పూడిపోయిన చేతిపంపుల సామగ్రిని తొలగించి వాటి స్థానంలో కొత్త పరికరాలు అమర్చుతున్నారు. గతంలో వీటి వల్ల బాటసారులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉపయుక్తంగా ఉండేవి. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ వేసవి నుంచి గట్టెక్కేలా చర్యలు తీసుకుంటోంది.
వీరికి ఆధారం
ఇంట్లో బోర్లులేని వారికి చేతిపంపులు ఆసరా కానున్నాయి. బోర్లు ఉండి కూడా ప్రస్తుతం నల్లానీటిపైనే అందరూ ఆధారపడుతున్నారు. దీంతో మిషన్‌ భగీరథ నీరు కూడా సరిపడా అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం నల్లా నీటిని వినియోగించే వారికి చేతిపంపులు ఆధారం కానున్నాయి. రెండుమాసాల వరకు నీటికి ఇబ్బందులు ఇలాగే ఉండనుండటంతో చేతి పంపులు ఆదుకోనున్నాయి. గ్రామాల్లో చేతిపంపులు పనికిరాకుంటే బోరుబావులను అద్దెకు తీసుకొని నీటినందించే పనిలో అధికారులు ఉన్నారు. ‘వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వ సూచనల మేరకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామ’ని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని