logo

అతివేగమే కారు ప్రమాదానికి కారణం

జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పైవంతెనపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు.

Updated : 13 Apr 2024 05:58 IST

‘పేట’లో ముగ్గురు యువకుల అంత్యక్రియలు పూర్తి

సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మృతదేహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తదితరులు

 సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పైవంతెనపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద పైవంతెనపై హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వాటర్‌ బాటిళ్ల లోడుతో మెల్లగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని కారు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టడంతోనే సూర్యాపేటకు చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. కారు నడుపుతున్న మహమ్మద్‌ నవీద్‌, వెన్న నిఖిల్‌రెడ్డి, బొమ్మగాని రాకేశ్‌గౌడ్‌ మృతిచెందారు. మరో యువకుడు సోమగాని ఆదిత్య అలియాస్‌ చందు గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు.

 మృతులంతా స్నేహితులే.. సూర్యాపేటలోని హైమానగర్‌కు చెందిన వెన్న సతీశ్‌రెడ్డి, మాధవి చిన్నకుమారుడు నిఖిల్‌రెడ్డి ఇంటీరియర్‌ గార్డెనింగ్‌ పూర్తి చేశారు. తండ్రికి బంగారు ఆభరణాల వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నారు. నిఖిల్‌రెడ్డి, రాకేశ్‌గౌడ్‌ పాఠశాల స్థాయి నుంచి ప్రాణ స్నేహితులు. జాకీర్‌ హుస్సేన్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ సోమనర్సయ్య కుమారుడు రాకేశ్‌గౌడ్‌ బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నారు. ఈయనకు ఒక సోదరి ఉన్నారు. పొట్టిశ్రీరాములు సెంటర్‌కు చెందిన వాహనాల బ్యాటరీ దుకాణంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న మొహినొద్దీన్‌ కుమారుడు మహమ్మద్‌ నవీద్‌తోపాటు కుమార్తె ఉన్నారు. నవీద్‌ స్థానికంగా ఒక మొబైల్‌ షోరూంలో మేనేజర్‌గా కొద్దికాలం పనిచేశారు. పదేళ్ల క్రితం వీరితో స్నేహం ఏర్పడింది. రంజాన్‌ సందర్భంగా స్నేహితులంతా కలిసి విందులో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

 ఎమ్మెల్యే పరామర్శ..

సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని శవాగారం వద్ద ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మృతుల కుటుంబాలను శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు. నిఖిల్‌రెడ్డి అంత్యక్రియలు కాసరబాద సమీపంలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో, నవీద్‌ అంత్యక్రియలు స్థానిక ఖబరస్థాన్‌లో, రాకేశ్‌గౌడ్‌ అంత్యక్రియలు రాజీవ్‌నగర్లోని శ్మశానవాటికలో అశ్రునయనాల మధ్య పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని