logo

పట్టభద్రులకు ఆనందమే

వరంగల్‌- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ వచ్చే నెల చివరి వారంలో ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు

Updated : 13 Apr 2024 05:47 IST

ఈనాడు, నల్గొండ : వరంగల్‌- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ వచ్చే నెల చివరి వారంలో ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికను జూన్‌ 9లోపు పూర్తి చేయాల్సి ఉన్నందునా.. ఈ నెల 20 లోపే షెడ్యూల్‌ వచ్చే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటరు తుది జాబితా ప్రకటన పూర్తి  అయింది. ఎన్నికల ఏర్పాట్లు సైతం తుది దశకు చేరాయి. సుమారు నాలుగు నెలల పాటూ సాగిన ఓటరు నమోదు ప్రక్రియలో అన్ని పార్టీలు చురుగ్గా పాల్గొన్నాయి. గడువు ముగిసే నాటికి మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. 2021 మార్చిలో జరిగిన ఈ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలపొందారు. దీంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు నల్గొండ కలెక్టర్‌ దాసరి హరిచందన రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)గా వ్యవహరించనున్నారు.  నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట, సూర్యాపేట, యాదాద్రి, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాల కలెక్టర్లు అసిస్టెంట్‌ ఆర్వోలుగా వ్యవహరిస్తారు.

 అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు

 ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి కసరత్తు చేస్తుండగా..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సైతం ఎవరిని బరిలోకి దింపితే విజయావకాశాలుంటాయనే దానిపై వివిధ వర్గాల ద్వారా సమాచార సేకరణ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచిన తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా మారింది. ప్రస్తుతం కరీంనగర్‌ నుంచి అధికార కాంగ్రెస్‌ నుంచి ఎంపీ టికెట్‌ ఆశిస్తున్న మల్లన్నకు అది దక్కకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ మద్దతిచ్చే అవకాశముందని తెలిసింది. ప్రతిపక్ష భారాస నుంచి సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన ఒంటెద్దు నర్సింహారెడ్డితో పాటూ వరంగల్‌ జిల్లాకు చెందిన రాకేశ్‌రెడ్డి సైతం బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. భాజపా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీ చేస్తారా లేదంటే కొత్త అభ్యర్థి రంగంలోకి వస్తారన్నది ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత స్పష్టం కానుంది. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాస ఇప్పటి నుంచి గెలుపుగుర్రాన్ని అన్వేషిస్తుండగా...ఈ దఫా ఎలాగైనా ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు రెండు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తొలి ప్రాధాన్యంగా లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో షెడ్యూల్‌ విడుదలైనా వచ్చే నెల 13న లోక్‌సభ పోలింగ్‌ తర్వాతే ఈ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని