logo

ఇంకిన కన్నీళ్లు ఇంకెన్నో..!

యాదాద్రి జిల్లా గుండాల ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో పాటు మూడో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గత ఆరు నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

Updated : 13 Apr 2024 05:46 IST

యాదాద్రి జిల్లా గుండాల ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో పాటు మూడో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గత ఆరు నెలలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మనవరాలి వయసున్న ఆ విద్యార్థినులను తన కార్యాలయానికి పిలిపించుకొని అసభ్య చేష్టలతో ఇబ్బంది పెట్టడమే కాక ఎవరికీ చెప్పొద్దని బెదిరిస్తుండటంతో తమ గోడు తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

‘ఈ నెల 3న కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శట్పల్లి ఉన్నత పాఠశాలలో షీటీం బృందం బాల బాలికలకు సైబర్‌ నేరాలు, లైంగిక వేధింపులు, మంచి, చెడు స్పర్శ (గుడ్‌, బ్యాడ్‌ టచ్‌) గురించి అవగాహన కల్పించారు. ఆ సమయంలో ఓ బాధిత విద్యార్థిని ఉపాధ్యాయుడి అరాచకాలపై ఫిర్యాదు చేసింది. తెలుగు ఉపాధ్యాయుడు గత కొంత కాలంగా తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని గోడు వెల్లబోసుకుంది. పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.

 నాంపల్లి, న్యూస్‌టుడే:  ఆప్యాయంగా పలకరిస్తే పొంగిపోయే పసితనం. పిలుపు వెనుక దాగిన వికృతాలను అర్థం చేసుకోలేని అమాయకత్వం. అభం శుభం తెలియని చిన్నారులు ప్రబుద్ధుల చేతిలో బలవుతున్నారు. తమపై జరుగుతున్న ఆకృత్యాలు బయటకు చెప్పేందుకు జంకుతున్నారు. విద్యార్థికి, ఉపాధ్యాయుడికి ఉన్న సంబంధం వేదాలకాలం నాటిది.. చాలా పవిత్రమైంది. ఉపాధ్యాయులంటే తరగతి గదిలో పాఠాలు బోధించే వారు మాత్రమే కాదు.. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి, జ్ఞానాన్ని అందించి, పిల్లల ఆలోచనలను తీర్చిదిద్దే గొప్ప హోదా ఉపాధ్యాయులకు ఉంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు వికృత చేష్టలకు పాల్పడుతూ తమ హోదాను దుర్వినియోగం చేస్తున్న తీరు సమాజంలో చర్చనీయాంశంగా మారుతోంది.

విషపు నీడలో..

పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ చిన్నారులపై లైంగిక వేధింపులు ఏటా పెరుగుతున్నాయి. నిందితుల్లో బాధితులకు తెలిసిన వ్యక్తులే 70-80 శాతం వరకు ఉంటున్నారు. నిత్యం ఏదో ఒక రూపంలో వేధింపులు చవిచూస్తూ బయటకు చెప్పేందుకు వెనకాడుతున్నా బాలికలు ఉన్నారు. పేద వర్గాలు పిల్లలు నివసించే ప్రాంతాలు, వలస కుటుంబాల్లోని పిల్లలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నట్లు తాము గుర్తించామని ఓ స్వచ్ఛంద సంస్థ మహిళా ప్రతినిధి తెలిపారు. బాల కార్మికులుగా మారుతున్న వారిలో బాలికలు ఉన్నారు. వీరిలో 30-40 శాతం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో గుర్తించారు. పట్టణాల్లోని మురికి వాడలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో లైంగిక వేధింపులు, గృహ హింస వంటి సున్నితమైన అంశాలను బాలికలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని