logo

నీతి పాఠాల ఊసేది..?

జీవిత కాలంలో బాల్యదశ ఎంతో ముఖ్యమైంది. ఆ వయసులో క్రమశిక్షణతో కూడిన చదువు ఎవరికి అలవడుతుందో వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. కానీ, పాఠశాలల్లో ఎక్కడ చూసినా నీతి పాఠాలు ఊసే లేకుండా పోతోంది.

Updated : 13 Apr 2024 05:50 IST

 విద్యార్థుల్లో కొరవడుతున్న వ్యక్తిత్వ వికాసం

 సూర్యాపేట: సత్రం బజారులోని పాఠశాలలో నిజాయతీ పెట్టెలో పెన్ను వేస్తున్న విద్యార్థిని

ఈనాడు డిజిటల్‌, సూర్యాపేట: జీవిత కాలంలో బాల్యదశ ఎంతో ముఖ్యమైంది. ఆ వయసులో క్రమశిక్షణతో కూడిన చదువు ఎవరికి అలవడుతుందో వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. కానీ, పాఠశాలల్లో ఎక్కడ చూసినా నీతి పాఠాలు ఊసే లేకుండా పోతోంది. విద్యార్థులు కేవలం పాఠాలకే పరిమితమవుతుండటంతో వారిలో వ్యక్తిత్వ వికాసం కొరవడుతోంది.

 పొదుపు మాట మరిచారు..

ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఏవిధంగా నగదు భద్రం చేసుకుంటున్నారో అదే తరహాలో ఈ బాలసంఘాలు కొనసాగాలన్నది ఉద్దేశం. విద్యార్థి దశ నుంచి పొదుపు అలవాటు చేసేందుకు రూపకల్పన చేసినదే సంచాయక పథకం. విద్యార్థులు సొమ్మును పొదుపు చేస్తే ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు ప్రస్తుతం ఏ పాఠశాలలోనూ జరగడం లేదు. దీంతో విద్యార్థుల్లో పొదుపు చేసే గుణం కొరవడుతోంది.

నిజాయతీ పెట్టె జాడేది..?

విద్యార్థులకు చిన్నతనం నుంచి మంచి లక్షణాలు అలవాటు చేస్తే భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా నిలుస్తారు. పాఠశాలల్లో దొరికిన వస్తువులను అక్కడి నిజాయతీ పెట్టెలో వేసేందుకు వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యార్థులకు నిజాయతీ అలవర్చుకోవడానికి ఏర్పాటు చేయాల్సిన పెట్టెలు జాడ విద్యాలయాల్లో కనిపించడం లేదు.

బాలల సంఘాలు లేవు..

బాలల హక్కులు, పత్రికల నుంచి సమాచార సేకరణ, పచ్చదనం పరిశుభ్రత, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రంథాలయాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు బాలల సంఘాలు ఏర్పాటు చేసేవారు. ఈ సంఘాల ద్వారా వారిలో చక్కని నాయకత్వ లక్షణాలు బలపడతాయి. అయితే ప్రస్తుతం ఏ పాఠశాలలోనూ వీటి ఊసే లేదు.

కానరాని తపాలా పెట్టె

తరగతి గదిలో జరిగే ఘటనలు, బోధన తీరు మధ్యాహ్న భోజనం నాణ్యత, వింతలు, విశేషాలపై రాసిన ఉత్తరాలను విద్యార్థులు పాఠశాలలో ఏర్పాటు చేసిన తపాలా పెట్టెలో వేసేవారు. ప్రస్తుతం వాటి వినియోగం ఎక్కడా కనిపించడం లేదు. ఫలితంగా ఉత్తరాలు రాసే నైపుణ్యం విద్యార్థుల్లో కొరవడుతోంది.


అన్ని పాఠశాలల్లో అమలు చేస్తాం
- అశోక్‌, జిల్లా విద్యాశాఖ అధికారి, సూర్యాపేట

సహపాఠ్యాంశాలు అన్ని పాఠశాలల్లో బోధించాలి. కొన్ని బడుల్లోనే ఇవి అమలవుతున్నాయి. వీటి అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. మండలాల విద్యాశాఖ అధికారులకు సూచనలిస్తాం. అన్ని పాఠశాలల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని