logo

బోరున విలాపం..!

వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోతున్నాయి. బత్తాయి, నిమ్మ తోటలను రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న భగీరథ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.

Updated : 13 Apr 2024 06:01 IST

ఎండుతున్న తోటలు..

3 నెలల్లో 26 బోర్లు వేసిన రైతు

 

ఎండుతున్న బత్తాయి తోట

తిప్పర్తి, న్యూస్‌టుడే: వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోతున్నాయి. బత్తాయి, నిమ్మ తోటలను రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న భగీరథ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.రూ.లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా నీటి జాడలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. అనేక గ్రామాల్లో తోటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. వడబడుతున్న తోటలను కాపాడుకునేందుకు సుమారుగా 5 నుంచి 10 బోర్ల వరకు వేశారు. జొన్నగడ్డలగూడకు చెందిన రైతు కుందూరు రాఘవరెడ్డి ఏకంగా 26 బోర్ల వరకు వేసినా ప్రయోజనంలేకుండా పోయింది. జిల్లాలో బత్తాయి 60 వేల ఎకరాలు, నిమ్మ 12 వేల ఎకరాలకు పైగా సాగవుతోంది. తిప్పర్తి మండలంలోనే బత్తాయి 2,200 ఎకరాలు, నిమ్మ 450 ఎకరాల్లో ఉంది. రాజుపేట, జొన్నగడ్డలగూడ, ఇండ్లూరు, మామిడాల, ఎర్రగడ్డలగూడ, పజ్జూరు, మర్రిగూడ, సిలార్మియాగూడ, తిప్పర్తి, గడ్డికొండారం, అనిశెట్టిదుప్పలపల్లి, అంతయ్యగూడ తదితర గ్రామాల్లో రైతులు ఎక్కువగా బత్తాయి, నిమ్మ, మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 20 సంవత్సరాల తోటలను కలిగి ఉండటంతో వాటిని రక్షించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. నెల రోజుల్లోనే మండలంలో రైతులు సుమారు 300లకు పైగా బోర్లు వేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి తోటలను రక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రగడ్డలగూడ గ్రామంలో కన్నెకంటి జానయ్య, ఎల్లయ్య, రవి, రాములు, పెద్ద జానయ్య తదితరులు ఒక్కొక్కరూ ఆరు బోర్ల వరకూ వేసినా చుక్కనీరు పడలేదు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.


 రూ. 20 లక్షలతో 26 బోర్లు  
కుందూరు రాఘవరెడ్డి, రైతు జొన్నలగడ్డ

నేను 20 ఎకరాల్లో బత్తాయి, నిమ్మ తోటలను సాగుచేస్తున్నా. గత 15 ఏళ్లుగా కంటికి రెప్పలా తోటలను కాపాడుకుంటూ వచ్చా. 10 ఏళ్లుగా తోట దిగుబడులను అందిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో వేసిన 6 బోర్లలో 3 పూర్తిగా ఎండిపోయాయి. మరో 3 బోర్లు సన్నటి ధార పోస్తుండటంతో తోట మొత్తానికి నీటి సరఫరా సరిపోవడంలేదు. తోటను ఎలాగైనా రక్షించాలన్న ఆశతో 3 నెలల వ్యవధిలో రూ.20 లక్షలు ఖర్చుచేసి ఒక్కొక్కటిగా వేస్తూ మొత్తం 26 బోర్లు కొత్తగా వేశా. ఈ 26 బోర్లలో కేవలం 3 బోర్లు సన్నటి ధారతో ఆగి ఆగి పోస్తున్నాయి. అధికారుల సూచన మేరకు నేను వ్యవసాయక్షేత్రంలో రూ.75 వేల ఖర్చుతో ఫాంపాండ్‌ను ఏర్పాటు చేసుకున్నా. బోర్లు పోస్తున్న సన్నటి ధారను పైపు ద్వారా ఫాంపాండ్‌లోకి నింపుకొని.. అక్కడి నుంచి మరో మోటార్‌ ద్వారా ప్రత్యేక పైపులైన్‌ను ఏర్పాటు చేసుకొని తోటను బతికించుకుంటున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని