logo

పరీక్షలకు వేళాయె

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 15 నుంచి 22 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం(ఎస్‌ఏ-2) పరీక్షలు జరగనున్నాయి

Updated : 13 Apr 2024 05:41 IST

మొల్కచర్ల ప్రాథమికోన్నత పాఠశాలలో పరీక్షల కోసం చదువుతున్న విద్యార్థులు
అడవిదేవులపల్లి, న్యూస్‌టుడే: ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 15 నుంచి 22 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం(ఎస్‌ఏ-2) పరీక్షలు జరగనున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొదట ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసి ఉదయం పూటనే అన్ని పరీక్షలు నిర్వహించేందుకు కాలపట్టిక విడుదల చేశారు. ఇప్పటికే బోర్డు నుంచి జిల్లాకు వచ్చిన ప్రశ్నాపత్రాలను మండల విద్యావనరుల కేంద్రాలకు సరఫరా చేశారు. అక్కడి నుంచి ఏ సబ్జెక్టుకు సంబంధించి ఆ సబ్జెక్టు పేపర్లను ఆయా పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. కానీ ఇప్పటికే పలు ప్రైవేట్‌ పాఠశాలలు ప్రైమరీ స్థాయి విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేశాయి. విద్యాసంవత్సరం చివరి రోజు ఏప్రిల్‌ 23న తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిపత్రాలను అందజేయనున్నారు.

ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు డీసీఈబీ (జిల్లా కామన్‌ పరీక్షల బోర్డు) ద్వారా ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రశ్నాపత్రాల పంపిణీ చేశారు. ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలలకు సంబంధిత యాజమాన్యం వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎస్‌ఏ-2 ప్రశ్నాపత్రాలు వారే తయారు చేసుకుని పరీక్షలు పెట్టుకోవాలి.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, గురుకులాలకు సంబంధించి 1,527 పాఠశాలలకు పరీక్షలు కొనసాగనున్నాయి. వీటిలో 1,19,030 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నెల 8 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు తొలుత నిర్ణయించిన దాన్ని 15కు మార్పు చేశారు. ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి విద్యార్థులకు 11.45 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు 12 గంటల వరకు పరీక్షలు జరగున్నాయి.


 లీకేజీకి పాల్పడితే గుర్తింపు రద్దు
-బాలాజీ, ఇన్‌ఛార్జి మండల విద్యాధికారి, అడవిదేవులపల్లి

6 నుంచి 9వ తరగతి ప్రశ్నాపత్రాలు ఎమ్మార్సీ, కస్టోడియన్‌ హైస్కూళ్లలో అందుబాటులో ఉంచాము. ఏ రోజు పరీక్షలకు సంబంధించి ఆ రోజు ప్రశ్నాపత్రాలను కేటాయించిన ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు తీసుకెళ్లాలి. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడితే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తాం. ఈ నెల 23 వరకు మూల్యాంకనం పూర్తిచేసి ప్రగతిపత్రాలు విద్యార్థులకు ఇవ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని