logo

ఉద్యోగులపై ఈసీ దృష్టి

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ నేరేడుచర్ల మండలకేంద్రానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు

Updated : 13 Apr 2024 05:55 IST

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ నేరేడుచర్ల మండలకేంద్రానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు గురువారం జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే ప్రకటించారు.

 సిద్దిపేట జిల్లాలో ఇటీవల ఓ పార్టీ అభ్యర్థి నిర్వహించిన సమావేశానికి హాజరైన 106 మంది పొరుగు సేవల ఉద్యోగులపై ఎన్నికల అధికారులు వేటు వేశారు. ఓ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సమావేశానికి వెళ్లిన తీరుపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. వేడుకలో పాల్గొన్న వారిని గుర్తించి విధులకు దూరంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది.’

నాంపల్లి, న్యూస్‌టుడే: సార్వత్రిక పోరు నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయడం తగదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నిఘా సహా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ పోస్టులపై ఓ కన్నేసి ఉంచింది. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నాయకులు ఎలా ప్రచారం చేసుకున్నా,  ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కలిగే ఫలితం కన్నా ప్రభుత్వ ఉద్యోగులు చేసే ప్రచారం, వారి వ్యవహార శైలి మాత్రం పెను చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. వీరు ఆయా పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా వ్యవహరించే సన్నివేశాన్ని దృశ్యరూపకంగా లేదా శ్రవణ రూపకం(వీడియో, ఆడియో) ద్వారా ఎవరైనా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి, యంత్రాంగానికి పంపినా, ప్రచార మాధ్యమాలు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ గ్రూపులలో పోస్టు చేసినా అంతే సంగతులని ఇటీవలి ఉదంతాలు తెలుపుతున్నాయి.

 ఇదీ తప్పే..

  • ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక అభ్యర్థికి సహకరిస్తున్నారనే చిన్నపాటి ఆధారాలు దొరికినా వేటు పడుతుంది.
  • తన కింది స్థాయి సిబ్బందిని అధికార దర్పంతో ఒక పార్టీకి సహకరించాలని, ఫలానా పార్టీకి ఓటేయాలని చెప్పకూడదు.
  •  ప్రభుత్వ ఉద్యోగులు ఫేస్‌బుక్‌ లేదా వాట్సప్‌ గ్రూపులలో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు నమోదు చేసినా కఠినమైన చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందే.
  •  ముఖ్యంగా ప్రచార సభల్లో పాల్గొనడం, తమ కులం నేత అని ప్రచారం చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తారు.
  •  వారి సొంత ఊళ్లలోనూ కండువా వేసుకొని ప్రచారం చేయడం లేదా.. రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం లాంటివి చేయొద్దు.

  హద్దు మీరితే అంతే సంగతులు..

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం చేయరాదనే నిబంధనలు 1949 సెప్టెంబర్‌ 17 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్‌, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే అన్ని స్థాయిలు, కేటగిరీల ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి అధికారి ఉద్యోగి తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఉద్యోగ బాధ్యతతో అందరి మన్నలను పొందాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని