logo

Cyber Crime: లింక్‌ నొక్కారంటే.. డబ్బు మాయం

నేడు స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగింది. డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్‌ మోసాలు జోరుగా సాగుతున్నాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్‌కాల్స్‌ చేయడం,

Updated : 21 May 2024 08:54 IST

బ్యాంకు సందేశాలతో మోసం
సైబర్‌ నేరస్థుల కొత్త పంథా

ఈనాడు డిజిటల్, సూర్యాపేట, నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నేడు స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగింది. డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్‌ మోసాలు జోరుగా సాగుతున్నాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్‌కాల్స్‌ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్‌ వస్తువులనో, ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైన వారి ఖాతా నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల రివార్డ్స్‌ పేరిట నకిలీ లింకులు చేరవేస్తున్నారు. వాట్సప్‌లోనూ రివార్డ్స్‌ లింకు పంపిస్తున్నారు. ‘మీ బ్యాంకు రివార్డ్స్‌ యాక్టివేట్‌ అయింది.. ఈరోజు ముగిసిపోతుందని, ఆ డబ్బులు పొందేందుకు క్యాష్‌ వోచర్‌ క్లిక్‌ చేసుకోవాలంటూ సందేశం పంపుతున్నారు. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ సందేశంలో పేర్కొంటున్నారు. ఓ జాతీయ బ్యాంకు యాప్‌ పేరిట ఓ లింకును సైతం జత చేస్తున్నారు.


సూర్యాపేట జిల్లాకేంద్రం పరిధిలో ఓ బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రం నిర్వాహకుడికి ఇటీవల ‘మీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సులువుగా చెల్లిస్తామ’ని చరవాణికి సందేశం పంపారు. ఆయన వృత్తిరీత్య నిజమై ఉండొచ్చని భావించాడు. మరోసారి అదే సందేశం రావడంతో బ్యాంకు అధికారులకు వివరించాడు. అది తప్పుడు సందేశం అని అటువంటి వాటిని నమ్మొద్దని చెప్పడంతో మోసం నుంచి బయటపడ్డాడు.


నల్గొండ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నెల కిందట  మహిళకు ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి పంపిస్తామని నమ్మించాడు. మొదట కొంత మొత్తం తీసుకొని దానికి తగిన విధంగా బంగారం పంపాడు. తర్వాత భారీ మోసానికి ఒడిగట్టాడు. మొత్తానికి విడతల వారీగా రూ.12 లక్షల వరకు నష్టపోయి, ఆన్‌లైన్‌ వివరాలన్నీ బ్లాక్‌ చేసినట్లు గుర్తించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


గుడ్డిగా నమ్మొద్దు
-రాహుల్‌ హెగ్డే, జిల్లా పోలీసు అధికారి, సూర్యాపేట

సైబర్‌ మోసగాళ్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకు రివార్డ్స్‌ పేరిట వస్తున్న సందేశాలు సైతం ఈ తరహాలోనివే. గుడ్డిగా నమ్మేయకుండా అప్రమత్తంగా ఉండాలి. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ వారియర్స్‌ అందుబాటులో ఉన్నారు. అనుమానిత సందేశాలు లింక్‌ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని