logo

ఊపందుకున్న ప్రచారం

నల్గొండ- వరంగల్‌-ఖమ్మం పట్టుభద్రుల స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 27న పోలింగ్‌ జరగనుంది. ప్రచార గడువు ఈ నెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగుస్తుంది.

Published : 22 May 2024 02:27 IST

భువనగిరి, న్యూస్‌టుడే: నల్గొండ- వరంగల్‌-ఖమ్మం పట్టుభద్రుల స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 27న పోలింగ్‌ జరగనుంది. ప్రచార గడువు ఈ నెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగుస్తుంది. ఇంకా నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా చేశాయి. మొత్తం 52 మంది రంగంలో ఉండగా.. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిల మధ్య పోటీ ఉంది. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రేమేందర్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్న, రాకేశ్‌రెడ్డి స్వయంగా ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు.  ఈ మూడు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వారి గెలుపు కోసం ఆయా పార్టీల కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓటరుగా నమోదు చేసుకున్న పట్టభద్రుల ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. తమ అభ్యర్థుల గుణగణాలు చెబుతూ ఓటును అభ్యర్థిస్తున్నారు. కాగా ప్రభుత్వ, పట్టణ కార్యాలయాలు, బ్యాంకులు, కోర్టులకు వెళ్లి న్యాయవాదులను కలిసి ఓటడుగుతున్నారు. ఇప్పటికే మూడు పార్టీలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా  సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. భాజపా అభ్యర్థి తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ రాకేశ్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన పట్టభద్రుల సమావేశాల్లో పాల్గొన్నారు. మూడు జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, అభ్యర్థి అంతటా స్వయంగా తిరిగి ప్రచారం చేయడం సాధ్యం కాదని, నాయకులు, కార్యకర్తలే అభ్యర్థులుగా భావించి ప్రచారం చేయాలని ఆ ఇద్దరు నాయకులు తమ పార్టీల శ్రేణులకు ఉద్భోదించారు. భాజపా అభ్యర్థికి మద్దతుగా బుధవారం పట్టణంలో భాజపా ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించనున్నారు. ఇక తీన్మార్‌ మల్లన్న గెలుపును కాంక్షిస్తూ భువనగిరి ఎమ్మెల్యే పట్టణంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రచారం ముమ్మరం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 34,080 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటరును కలిసేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దూర ప్రాంతంలో ఉంటున్న వారిని ఓటేసేందుకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదటి ప్రాధాన్యతగా ఓటు పైనే దృష్టి పెట్టారు. 52 మంది రంగంలో ఉండటంతో మొదటి ప్రాధాన్యత ఓటు ఒక్కటే తమ అభ్యర్థులకు వేయించేందుకు ఎవరికి వారుగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ద్వితీయ ప్రాధాన్యతగా ఓటు వేయకుండా ఒకే ఓటు పడేలా రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. వీలైన ఎక్కువ ఓట్లు సింగిల్‌గా వేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న భారాస ఉప ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగరవేయాలని, గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన తీన్మార్‌ మల్లన్నను గెలిపించుకోవాలని అధికార పార్టీ, మోదీ హవాతో గెలిచి తీరాలన్న పట్టుదలతో భాజపా పార్టీలు వ్యూహ ప్రతిప్యూహాలు చేస్తున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని