logo

ఓటు వేసే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి: ఎన్నికల అధికారి

వరంగల్‌ -ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారి,నల్గొండ కలెక్టర్‌ దాసరి హరిచందన తెలిపారు.

Updated : 22 May 2024 05:44 IST

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: వరంగల్‌ -ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారి,నల్గొండ కలెక్టర్‌ దాసరి హరిచందన తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌పై ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేసిన వాయిలెట్‌ స్కెచ్‌ పెన్‌ను మాత్రమే ఉపయోగించాలని ఓటర్లకు సూచించారు. ఓటు వేసేందుకు ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, లేదా 2, లేదా 3..4 ఇలా ప్రాధాన్యతా క్రమంలో అంకెల రూపంలో మాత్రమే పేర్కొనాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటు కింద 1వ అంకెను ఒక అభ్యర్థికి ఎదురుగా ఉన్న స్థలంలో మాత్రమే మార్క్‌ చేయాలని పేర్కొన్నారు. ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ బ్యాలెట్‌ పేపర్‌లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా 1, 2, 3.. వంటి అంకెల రూపంలో మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలని వివరించారు. ఓటు వేసేటప్పుడు భారతీయ సంఖ్యలైన 1, 2, 3 లేదా రోమన్‌ తరహాలో మార్క్‌ చేయవచ్చన్నారు.

ఇవి చేయకూడదు..

శాసనమండలి ఉప ఎన్నికల్లో ఓటర్లు బ్యాలెట్‌ పేపర్‌పై ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతా ఓటు 1వ సంఖ్య ఇవ్వకూడదని హరిచందన తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌పై సంతకం చేయొద్దని, ఇనీషియల్‌ వేయడం, పేర్లు, అక్షరాలు రాయకూడదని పేర్కొన్నారు. బ్యాలెట్‌పై 1, 2, 3, 4, 5... ఇలా సంఖ్యల రూపంలో మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, పదాల రూపంలో వన్, టూ, త్రీ అని రాయకూడదని సూచించారు. బ్యాలెట్‌పై మార్క్‌ టిక్‌ వేయడం, లేదా ఇంటు గుర్తు పెట్టడం చేయకూడదన్నారు. ఒక అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులకు వచ్చేలా నెంబర్‌ మార్క్‌ చేయకూడదన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని