logo

ప్రభుత్వ బడి.. ప్రకాశించదేమి?

కార్పొరేట్‌ విద్య కొత్త పుంతలు తొక్కుతోంది. పట్టణాల్లో విస్తరించి ఉన్న పలు కార్పొరేట్‌ సంస్థలు ఇప్పుడు పల్లె దరికి చేరువవుతున్నాయి.

Published : 22 May 2024 02:37 IST

గరిడేపల్లి, న్యూస్‌టుడే: కార్పొరేట్‌ విద్య కొత్త పుంతలు తొక్కుతోంది. పట్టణాల్లో విస్తరించి ఉన్న పలు కార్పొరేట్‌ సంస్థలు ఇప్పుడు పల్లె దరికి చేరువవుతున్నాయి. పట్టణాలకు వెళ్లి చదివించలేని తల్లిదండ్రులు ఇదో సువర్ణావకాశంగా భావిస్తున్నారు. గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఏటా కొన్ని పాఠశాలలు మూతపడుతున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అంకెలకే పరిమితమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నా.. రావడానికి ఆసక్తి చూపడం లేదు. అదేమంటే అనేక కారణాలు చెబుతున్నారు. మండల కేంద్రాల్లో నెలకొల్పిన ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఉండటం, బస్సు సౌకర్యం కల్పిస్తుండటంతో గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రులు అటువైపు మొగ్గు చూపారు. ఒకరిని చూసి మరొకరు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలనే ఆలోచనకు వస్తున్నారు. అందుకే ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. ప్రధానంగా 1-5 తరగతి బడుల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా ఉంటోంది. గతేడాది ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక పాఠశాలలు మూతపడగా, చాలా వాటిలో 10 కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 274 పాఠశాలలు గతేడాది పిల్లలు లేక మూతపడ్డాయి. 119 పాఠశాలల్లో 10 లోపు విద్యార్థులు ఉన్నారు. వాటిలో 117 ప్రాథమిక, రెండు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 80 పాఠశాలలు మూతపడ్డాయి. 131 పాఠశాలల్లో 10 లోపు విద్యార్థులు ఉన్నారు. వాటిలో 127 ప్రాథమిక పాఠశాలలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఒకటి ఉన్నత పాఠశాల. యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 పాఠశాలలు మూత పడగా, 29 పాఠశాలల్లో 10 లోపు విద్యార్థులు ఉన్నారు. 

కార్పొరేట్‌ వైపు..

హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాలు, పట్టణాలకే పరిమితమైన పలు కార్పొరేట్‌ సంస్థలు(పాఠశాలలు) ఇటీవల మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు విస్తరించాయి. దాంతో దూర ప్రాంతాలకు వెళ్లి కార్పొరేట్‌ విద్యను అభ్యసించలేని వారంతా స్థానికంగా ఏర్పాటు చేసిన పాఠశాలల్లోనే చేరుతున్నారు. మండల కేంద్రాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణమని భావిస్తుండగా కొత్తగా కార్పొరేట్‌ పాఠశాలలు వచ్చి మరింత దెబ్బతీస్తున్నాయని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం గురుకుల, ఆదర్శ పాఠశాలల మాదిరిగా కార్పొరేట్‌కు దీటుగా ఉత్తమ, ఆంగ్ల విద్యను అందిస్తేనే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు మనుగడలో ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని