logo

పట్టభద్రులూ.. ఓటు వేయాలి ఇలా..!

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 27న జరగనుంది. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు.

Published : 22 May 2024 02:42 IST

ఆలేరు, న్యూస్‌టుడే: నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 27న జరగనుంది. మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సాధారణ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్‌ విధానంలో తేడాలున్నాయి. చాలా మందికి ఓటు వేసే విధానం తెలియక చేసే పొరపాట్లతో ఓటు చెల్లకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఉండవు. బ్యాలెట్‌ పత్రం మాత్రమే ఉంటుంది. బ్యాలెట్‌ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఓటు వేయాలి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును వేసే విధానంపై వివరాలు మీ కోసం..

ఓటింగ్‌ విధానం..

  • ఓటు వేయడానికి ఓటరు స్లిప్, ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా ఒక ఓటరు గుర్తింపు పత్రం వెంట తీసుకువెళ్లాలి.
  • పోలింగ్‌ అధికారి బ్యాలెట్‌ పేపర్, పెన్ను ఇస్తారు. వాటినే ఉపయోగించాలి.
  • బ్యాలెట్‌ పత్రంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేరు, పార్టీ, పక్కన బాక్స్‌ ఉంటాయి.
  • ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఉంటాయి. 
  • పోలింగ్‌ అధికారి ఇచ్చిన పెన్నుతో 1,2,3,4...ఇలా ప్రాధాన్య క్రమంలో కేటాయించాలి.
  • మొదటి ప్రాధాన్య ఓటు(1) మాత్రం తప్పక వేయాలి. వేయకుంటే ఓటు చెల్లదు. 
  • ఒక ఓటరు ఒక్కరికే ఓటు వేయవచ్చు.. లేదా కొంత మందికి లేదా అందరికీ ఓటు వేయవచ్చు. అది మన ఇష్టం. ప్రాధాన్య క్రమాన్ని మాత్రం తప్పవద్దు.

ప్రాధాన్య క్రమం ఇలా..

ఉదాహరణకు పోటీలో 52 మంది ఉన్నారని అనుకుందాం. కేవలం ఆరుగురికి మాత్రమే ఓటు వేయాలని భావిస్తే.. బ్యాలెట్‌ పత్రాన్ని పరిశీలించి అందులో మొదటి ప్రాధాన్య ఓటు వేయాలనుకునే వారి పేరు, ఫొటో ఎదురుగా ఉన్న బాక్స్‌లో 1 నెంబరు రాయాలి. మిగతా ఎంచుకున్న ఐదుగురు ఫొటోల ఎదురుగా ఉన్న బాక్సులలో 2, 3, 4, 5, 6 నెంబర్లు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ 1, 2, 3 నెంబర్లు వేసిన తర్వాత 4 నెంబరు రాయకుండా 5వ నెంబరు వేస్తే ఆ ఓటు చెల్లదు. 1 నెంబరు వదిలేసి 2, 3, 4, 5 ,6 నెంబర్లు వేసినా ఆ ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్‌ పత్రంపై రోమన్‌ అంకెలు రాయకూడదు. ఒకటి, రెండు.. అని తెలుగులోనూ రాయవద్దు. రైట్‌ మార్క్‌ లాగా టిక్‌ చేయవద్దు. బ్యాలెట్‌ పత్రంలో ఎక్కడా సంతకం పెట్టవద్దు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని