logo

సన్నగా తెరపైకి..!

వరి విత్తనాల్లో సన్న రకాల సాగు మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో సన్నాల సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం ఒక్క సీజన్‌కే మాట మార్చింది. ఇ

Published : 22 May 2024 02:58 IST

గరిడేపల్లి, న్యూస్‌టుడే

రి విత్తనాల్లో సన్న రకాల సాగు మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో సన్నాల సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం ఒక్క సీజన్‌కే మాట మార్చింది. ఇప్పుడు మళ్లీ సన్నాల సాగుకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాటి కష్టాలు, జరిగిన నష్టాల అనుభవంతో ఉన్న రైతులు సన్నాల సాగంటేనే భయపడుతున్నారు. బోనస్‌ రావాలంటే సాగు చేయక తప్పదని భావిస్తున్నారు.  

గతంలో ఏం జరిగిందంటే..

గతంలో ప్రభుత్వం సన్న రకాలు సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చింది. 2021 వానాకాలంలో దొడ్డు రకాల సాగు పూర్తిగా తగ్గించి స్వల్పకాలిక వరి వంగడాలు సాగు చేయాలని సూచించింది. ఏ జిల్లాలో, ఏ పంట, ఎంత సాగు చేయాలో వ్యవసాయ శాఖకు ప్రణాళికలు ఇచ్చి అమలు చేయించింది. పత్తి, వరిలో సన్నాలు, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేయాలని సూచించింది. ప్రభుత్వ పిలుపు అందుకున్న సగానికి పైగా రైతులు సన్నాల సాగు చేశారు. ఆ సంవత్సరం పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ఒక్కసారిగా సన్నరకాల దిగుబడి ఎక్కువగా రావడంతో పాటు సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగి ధాన్యం అమ్మకాలకు కష్టాలు వచ్చాయి. ఆరంభంలో మిల్లర్లు కొనడానికి ఆసక్తి చూపినా, రోజుకు వందల కొద్దీ లారీలు, ట్రాక్టర్ల ధాన్యం వస్తుండటంతో చేతులెత్తేశారు. ఊహించని రీతిలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సన్నరకాల ధాన్యం వచ్చింది. మిల్లులకు ధాన్యం పోటెత్తింది. దాంతో మిల్లర్లు కొనలేక ధర తగ్గించడంతో పాటు రోజుకు కొన్ని ట్రాక్టర్లే కొంటామని చెప్పేశారు. గత్యంతరం లేక టోకెన్‌ విధానం ప్రవేశపెట్టారు. ఓ వైపు వర్షాలకు వరి పడిపోవడం, పంట కోతకు వచ్చినా టోకెన్‌ దొరక్కపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఒకరోజు ట్రాక్టర్‌ లోడు తీసుకెళ్తే మూడు రోజులపాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పచ్చి ధాన్యం కావడంతో ముక్కి నాల్గో రోజు అమ్మడానికి వెళ్తే మిల్లర్లు పేచీ పెట్టి కొనకపోవడంతో క్వింటా రూ.1,300 నుంచి రూ.1,500లకు అమ్ముకున్నారు. మిర్యాలగూడ మిల్లుల వద్ద భారీ పోలీసుల మోహరింపుతో ధాన్యం కొనుగోళ్లు జరిపారు. ఈ పరిస్థితిపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ప్రభుత్వం 2021 యాసంగిలో సన్నరకాల సాగు చేయాలని చెప్పకుండా రైతుల ఇష్టమంటూ చేతులు దులుపుకొంది. 


ఇప్పుడు మళ్లీ..

ప్పుడు ప్రభుత్వం బోనస్‌ ఇస్తామనడంతో మళ్లీ సన్న రకాల సాగు పెరుగుతుందనే వాదన వస్తోంది. ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఆరబెట్టి ఇవ్వాలి. అదే సన్నాలను మిల్లర్లు కొంటే నేరుగా పొలం నుంచి మిల్లుకు తరలించవచ్చు. గత అనుభవాలతో ప్రధానంగా భువనగిరి జిల్లా రైతులతో పాటు నల్గొండ జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు సన్నాల సాగు చేపట్టడంపై ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మిగతా ప్రాంత రైతులు ఇప్పటికే సన్నాల సాగు చేస్తున్నారు. ఎందుకిలా చేశారంటే..
ప్రభుత్వం ఐకేపీల ద్వారా కొనుగోలు చేయడంతో భారీగా పౌరసరఫరాల శాఖకు నిధులు కేటాయించాల్సిన పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బియ్యం కోటా పంచాయితీ, ఐకేపీలలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోవడం.. లాంటి సమస్యలను అధిగమించడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి ఇలా చేశారనే వాదన అప్పట్లో అధికారులు వినిపించారు. దాంతోపాటు సీఎంఆర్‌ బియ్యం సేకరించడంలో ఏటా వైఫల్యం చెందడం వంటి కారణాలతో, మిల్లర్లతో చర్చించి సన్నాల సాగుకు ఉపక్రమించారు. కానీ వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు