logo

మోసపోతే గోసపడతాం..!

నల్గొండ అర్బన్, మిర్యాలగూడ, హాలియా, హుజూర్‌నగర్‌ : ఒకసారి కాంగ్రెస్‌ పార్టీ హామీలకు మోసపోయామని (గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయడాన్ని ప్రస్తావిస్తూ)..

Published : 22 May 2024 03:01 IST

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార సభల్లో మాజీ మంత్రి కేటీఆర్‌

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, నల్గొండ అర్బన్, మిర్యాలగూడ, హాలియా, హుజూర్‌నగర్‌ : ఒకసారి కాంగ్రెస్‌ పార్టీ హామీలకు మోసపోయామని (గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయడాన్ని ప్రస్తావిస్తూ).. ఇప్పుడూ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే గోస పడుతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఉన్నత విద్యావంతుడు అయిన భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నేరచరిత్ర గల వాడని, బ్లాక్‌మెయిల్, బూతులు తప్ప ఆయన నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడన్నారు. వరంగల్‌- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంగళవారం పర్యటన చేశారు. తొలుత నల్గొండ ప్రచార సభలో పాల్గొని అక్కడి నుంచి దేవరకొండకు వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ తండ్రి ఇటీవల మరణించడంతో ఆయనను పరామర్శించారు. అనంతరం హాలియా, మిర్యాలగూడ సభల్లో పాల్గొని చివరగా హుజూర్‌నగర్‌ చేరుకున్నారు.

భారాసలో విద్యావంతులకు ప్రత్యేక స్థానం ఉంటుందని.. సాగర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నోముల భగత్‌ను ఎందుకు గెలిపించలేదో ప్రజలకే తెలియాలన్నారు. గత పదేళ్ల భారాస ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు. తనను గెలిపిస్తే ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేస్తానని, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఉన్నా లేనట్లేనని, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నేర చరిత్ర అందరికీ తెలిసిందేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చెప్పే మాయ మాటలకు మోసపోవద్దని, భారాస అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తీన్మార్‌ మల్లన్న నేర చరిత్ర, అక్రమ వసూళ్లు ఓటర్లు గమనించాలని భారాస రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్, భాస్కర్‌రావు, బూడిద భిక్షమయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


జేబుదొంగల చేతివాటం 

భారాస ప్రచార సభల్లో పలు చోట్ల జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. నల్గొండలో ఓ దొంగ కార్యకర్త జేబులో నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడటంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మిర్యాలగూడ, హాలియాలోనూ పలువురి కార్యకర్తల డబ్బులు పోయినట్లు తెలిసింది  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని