logo

తగ్గుతున్న సాధారణ ప్రసవాలు

జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు, ప్రతి శుక్రవారం ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు, ఇతర వైద్య సేవలపై సమీక్షలు నిర్వహించే వారు.

Updated : 22 May 2024 03:09 IST

నల్గొండ అర్బన్, న్యూస్‌టుడే

జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు, ప్రతి శుక్రవారం ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు, ఇతర వైద్య సేవలపై సమీక్షలు నిర్వహించే వారు. ఇటీవల ఎలాంటి సమీక్షలు లేక పోవడంతో ప్రభుత్వాసుపత్రి వైద్యం పక్కదారి పడుతోంది. ప్రధానంగా జిల్లాలో జరుగుతున్న ప్రసవాల్లో 65 శాతానికి పైగా శస్త్రచికిత్సలే ఉంటున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. శస్త్రచికిత్సల మూలంగా వచ్చే అనర్ధాలు ముందే చెప్పడంలో సంబంధిత అధికారులు, సిబ్బంది విఫలమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యఆరోగ్యశాఖ అధికారులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నా.. అనుకున్న స్థాయిల్లో ఫలితాలు రావడం లేదు. జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్, నకిరేకల్‌ ఏరియా ఆసుపత్రులతో పోటు 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి.   

ప్రైవేటుకు వెళ్తే..

గ్రామ, పట్టణ స్థాయిల్లో ఆశాలు, ఏఎన్‌ఎంలు గర్భిణులకు సూచనలు చేస్తున్నా.. కొంత మంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న బాధితులను కొందరు కింది స్థాయి ఉద్యోగులు కమీషన్లకు కక్కుర్తి పడి ప్రైవేటుకు పంపుతున్నారు. ఒక్కరిని ప్రైవేటులో చేర్చితే వారి నుంచి రూ.4వేల నుంచి రూ.5 వేల వరకు కమీషన్లు పొందుతున్నట్లు సమాచారం. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే బాధితుల్లో 90 శాతం మందికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ముందుగానే రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ప్యాకేజీలు నిర్ణయించారు.


ప్రసవాల సంఖ్య మరింత పెంచుతున్నాం

-అన్నిమల్ల కొండల్‌రావు, డీఎంహెచ్‌వో, నల్గొండ

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి తీవ్ర స్థాయిల్లో కృషి చేస్తున్నాం. అన్ని ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను పోత్సహిస్తున్నాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో  కూడా శస్త్రచికిత్సలు తగ్గించి సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూళ్లు చేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని