logo

పల్లెపై వారిదే పెత్తనం.. వచ్చేసింది నకిలీ విత్తనం

మరో పది రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండలోని మారుమూల ప్రాంతాలైన దేవరకొండ, హాలియా, చందంపేట, నాంపల్లి, మునుగోడు, చండూరుతో పాటూ ఆలేరు, సూర్యాపేట, నకిరేకల్, నల్గొండ లాంటి ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను పలువురు డీలర్లు డంప్‌ చేస్తున్నారు.

Published : 22 May 2024 03:08 IST

నియంత్రణ చర్యలకు చొరవ చూపని పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ యంత్రాంగం
ఈనాడు, నల్గొండ 

రో పది రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండలోని మారుమూల ప్రాంతాలైన దేవరకొండ, హాలియా, చందంపేట, నాంపల్లి, మునుగోడు, చండూరుతో పాటూ ఆలేరు, సూర్యాపేట, నకిరేకల్, నల్గొండ లాంటి ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను పలువురు డీలర్లు డంప్‌ చేస్తున్నారు. ఏటా ఈ సమయంలోనే ఈ ప్రాంత రైతులే లక్ష్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, వనపర్తి నుంచి కొన్ని కంపెనీల డీలర్లు సంబంధిత వ్యవసాయ అధికారులు కొంత మందితో కుమ్మక్కై విత్తనాలను అమ్ముతున్నట్లు తెలిసింది. పత్తితో పాటూ వరి, మిర్చి, కూరగాయలకు సంబంధించిన నాసిరకం విత్తనాలు పెద్ద ఎత్తున వానాకాలం సీజన్‌ ఆరంభం అయిన జూన్‌ మొదటి వారంలో మార్కెట్లోకి పోటెత్తుతున్నాయి.

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా ఈ నకిలీ, నాసికరం విత్తనాల వల్ల రైతులు సుమారు రూ.100 కోట్ల మేర నష్టపోతున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల రైతులకు కావాల్సిన విత్తనాలు కావాలంటే ఇతర నాసిరకం కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను తీసుకోవాలని పలువురు దుకాణాదారులు మెలిక పెడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు వాటినీ కొనుగోలు చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్న కంపెనీలు అమ్మే విత్తనాలనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం పదే పదే రైతులకు విజ్ఞప్తులు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే పత్తి పంట సాగవుతోంది. ఈ ఏడాదీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాలకు పైగానే పత్తి పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. ఒక్క దేవరకొండ డివిజనలోనే సుమారు 2.5 లక్షల ఎకరాల వరకు పత్తిని రైతులు సాగు చేస్తారు. దీంతో ఈ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను పలువురు డీలర్లు అమ్ముతారని తెలిసినా సంబంధిత అధికారులు మాత్రం నియంత్రణ చర్యలు తీసుకోవడంలో తాత్సరం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గత రికార్డులు సరిగా లేని డీలర్లపై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా నామమాత్ర చర్యలతోనే సరిపెడుతున్నారు. నకిలీలను అరికట్టడానికి, డీలర్లను ఆన్‌లైన్‌లోనే నమోదు చేసే విధంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఆన్‌లైన్‌ లైసెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ (ఓఎల్‌ఎంఎస్‌) అనే యాప్‌ నిర్వహణను సైతం అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. 
  • ఇప్పటికే పలువురు నకిలీ కంపెనీల డీలర్లు దేవరకొండ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ అధికారితో పాటూ క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసే ఇద్దరు సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకొని పలువురు రైతులకు విత్తనాలను తక్కువ ధరకుచ  ఉద్దెరకు ఇవ్వడానికి సిద్ధమయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆర్థిక ఇబ్బందులున్న పలువురు రైతులు వీటిని కొనుగోలు చేసి వీటిని ఇతర రైతులకు బాగున్నాయని చెప్పేటట్లు సైతం ఒప్పందం చేసుకున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా సమాచారం. తీరా వీటిని విత్తుకున్నాక పత్తి కాయ రాలిపోవడం, తెగుళ్లు సోకడం, దిగుబడి తగ్గడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. మరోవైపు బీటీ -3 విత్తనాలను సైతం విడిగా అమ్మకాలు చేసేందుకు దేవరకొండ ప్రాంతంలోని పలువురు డీలర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎకరానికి పది క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయని ఆశచూపి రైతులను మోసం చేస్తున్నారు.
  • తక్షణం జిల్లా అధికార యంత్రాంగంతో పాటూ పోలీసు ఉన్నతాధికారులు స్పందించి మూడు శాఖల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి వీటిని నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. 

అవగాహన, నియంత్రణ చర్యలేవీ? 

కిలీ విత్తనాల నియంత్రణకు గతంలో వానాకాలం సీజన్‌కు ముందే మే నెలలోనే పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మూడు శాఖల అధికారులతో కలిపి ఉమ్మడిగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసేవారు. వీరు క్షేత్రస్థాయిలో గతంలో నకిలీ విత్తనాలు అమ్మి కేసులున్న డీలర్లపై నిఘా పెట్టి రైతులను మోసపోకుండా అవగాహన చర్యలు తీసుకునేవారు. ఈ దఫా అలాంటి చర్యలేవీ కనబడకపోవడంతో రైతులు మోసపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటినుంచే పలు దుకాణాల్లో సోదాలు నిర్వహించి ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటూ కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీ విత్తనాల కంపెనీలను సీజ్‌ చేయాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని