logo

Congress: కాంగ్రెస్‌లో రెండు టిక్కెట్ల రగడ.. ఉత్తమ్‌, జానా కుటుంబాల నుంచి ఇద్దరు పోటీ?

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో రెండు టిక్కెట్ల రగడ రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ఎంపీ ఉత్తమ్‌ ఇప్పటికే ప్రకటించారు.

Updated : 31 Aug 2023 07:08 IST

చర్చనీయాంశంగా మారిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు

ఈనాడు, నల్గొండ :ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో రెండు టిక్కెట్ల రగడ రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ఎంపీ ఉత్తమ్‌ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ దఫా తాను పోటీ చేయడం లేదని గతంలోనే ప్రకటించిన సీనియర్‌ నేత జానారెడ్డి, తన ఇద్దరు కుమారులను బరిలో దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు కుమారులు మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేశారు. గత రెండు ఎన్నికల్లోనూ ఉత్తమ్‌ దంపతులిద్దరూ రెండు స్థానాల్లో పోటీ చేయగా..జానారెడ్డి గత ఎన్నికల్లో తన కుమారుడు రఘువీర్‌ను మిర్యాలగూడ నుంచి బరిలో దింపాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈ ఎన్నికల్లో స్వయంగా తానే తప్పుకొని కుమారులిద్దరినీ పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు దిల్లీ పెద్దలతో మాట్లాడారని, వారు సైతం పచ్చజెండా ఊపారని ఆయన సన్నిహితులు ‘ఈనాడు’కు వెల్లడించారు. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో అనివార్యం అయితే తప్ప ఉత్తమ్‌, జానారెడ్డి కుటుంబాల నుంచి ఇద్దరూ పోటీ చేయడం ఖాయంగా మారిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన పీఏసీ సమావేశంలో రెండు టిక్కెట్లపై సీనియర్‌ నేతలిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందన్న ప్రచారం నేపథ్యంలో త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని మాజీ మంత్రి ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు.

పైరవీలు షురూ..!

ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లోంచి మూడు పేర్లతో.. రాజకీయ ఎన్నికల కమిటీ (పీఏసీ) వచ్చే నెల 2న జరిగే సమావేశంలో తుది జాబితాను రూపొందించనుంది. దీంతో టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసిన ఆశావహులు తమకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలను ఉపయోగించి తుది జాబితాలో తమ పేరు ఉండేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్‌, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని సీనియర్‌ నేతలు, రాష్ట్ర నేతల ఆశీస్సులు పొందాలని పలువురు ఆశావహులు ఇప్పటికే వారిని కలిసి తమకు ఈ ఎన్నికల్లో పార్టీ టిక్కెటివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వేల నేపథ్యం, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి పార్టీకి చేసిన సేవలు, అంగ, అర్థబలాలను పరిగణనలోకి తీసుకునే ఈ దఫా టిక్కెట్‌ కేటాయింపులు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా సర్వేలే ప్రమాణికంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వారికి ధీటైన అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న వాదన క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ

‘అవసరం అయితే నల్గొండ స్థానాన్ని బీసీలకు ఇవ్వడానికి సిద్ధం’ అన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు బీసీ స్థానాలు కేటాయించాలని ఇప్పటికే టీపీసీసీ విధాన నిర్ణయం తీసుకుంది. నల్గొండ పార్లమెంటు పరిధిలో హుజూర్‌నగర్‌, కోదాడ నుంచి ఉత్తమ్‌ దంపతులు పోటీ చేస్తామని ప్రకటించగా..మిర్యాలగూడ, సాగర్‌ టిక్కెట్లను జానారెడ్డి తన కుమారులకు కేటాయించాలని కోరుతున్నారు. దేవరకొండ ఎస్టీలకు రిజర్వు కాగా..సూర్యాపేట టిక్కెట్‌ కోసం దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక మిగిలింది నల్గొండ మాత్రమే. నల్గొండ నుంచి ఐదు సార్లు పోటీ చేసిన కోమటిరెడ్డి నాలుగు సార్లు విజయం సాధించి, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ దఫా నల్గొండ నుంచే పోటీ చేస్తానని గతంలో చాలా సార్లు ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని