logo

చుక్కల పల్లకిలో.. ముక్కలు పళ్లెంలో..!

రాజధానికి ఆనుకొని ఉండి వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఓ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు ఓటుకు రూ. 2 వేలు చొప్పున సుమారు 1.50 లక్షల ఓట్లకు పంపిణీ పూర్తి చేశాయి. మరో ప్రధాన పార్టీ అభ్యర్థి రూ.వేయి చొప్పున లక్ష ఓట్లకు పంపిణీ చేశారు.

Updated : 29 Nov 2023 10:12 IST

డబ్బు, మద్యంతో పాటూ ఇంటికి కిలో మాంసం పంపిణీ

రాజధానికి ఆనుకొని ఉండి వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఓ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు ఓటుకు రూ. 2 వేలు చొప్పున సుమారు 1.50 లక్షల ఓట్లకు పంపిణీ పూర్తి చేశాయి. మరో ప్రధాన పార్టీ అభ్యర్థి రూ.వేయి చొప్పున లక్ష ఓట్లకు పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లున్న పురపాలికకు ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడు తన స్వగ్రామంలో అభ్యర్థి ఇచ్చిన రూ.2 వేలతో పాటూ ఇంటికి కిలో కోడి మాంసాన్ని సొంత ఖర్చులతో మంగళవారం పంపిణీ చేసినట్లు సమాచారం. పోలింగ్‌ ముందు రోజు మరో దఫాలో ఓటుకు హీనపక్షం రూ.500 నుంచి రూ. వేయి పంచేందుకు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి బూత్‌స్థాయికి డబ్బులను చేర్చినట్లు తెలిసింది.

ఈనాడు, నల్గొండ : ఎన్నికలకు అధికార యంత్రాంగాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం పన్నెండు నియోజకవర్గాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారు. కొన్ని చోట్ల నగదుతో పాటూ మద్యం, మాంసం పంచడానికి సైతం క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా హామీలు ఇస్తూ తొలి విడతగా కొంచెం నగదును ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇచ్చినట్లు తెలిసింది. గెలిచిన అనంతరం వారికి ఏం కావాలంటే అది చేస్తామని అభ్యర్థుల తరఫున స్థానిక నేతలు హామీలిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లలో అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉన్నవారికి డబ్బులు, నగదుతో పాటూ వారికి అవసరమైన మౌలిక వసతులను సమకూరుస్తున్నారు. ప్రధానంగా పార్టీ క్యాడర్‌, తటస్థ ఓటర్లతో పాటూ ఎదుటి పార్టీలో ఉన్నా తమకు ఓటు వేస్తారని నమ్మకం ఉన్న వారికి అభ్యర్థులు నగదును పంపిణీ చేస్తున్నారు.

వలస ఓటర్లకు గాలం

ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సగటున హీనపక్షం 30 వేల వరకు వలస ఓటర్లు ఉండటంతో వారిని రప్పించడానికి ప్రధాన పార్టీల నాయకులు తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే దూరప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామాల్లోకి రప్పించి వారికి రానుపోను ఖర్చులతో పాటూ ఓటుకు రూ. 3 వేల వరకు ముట్టజెబుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో రప్పించిన పార్టీకి కాకుండా ఎదుటి పార్టీకే ఓటు వేస్తామని చెప్పడంతో వారూ ఓటుకు రూ. 2 వేల వరకు పంపిణీ చేసినట్లు తెలిసింది. తమకు కచ్చితంగా ఓట్లు పడుతాయని భావిస్తున్న చోట ఎంతకైనా ఖర్చుచేసేందుకు అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. ఇతర పార్టీల్లోని ఓట్లలో నమ్మకమైన వారి ద్వారా డబ్బులు ఇచ్చి వారి ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నగదు, మద్యం సరఫరాపై భారీగా నిఘా పెట్టినా.. కొన్ని చోట్ల వారిని తప్పించుకొని ప్రధాన పార్టీల నాయకులు అనుకున్న చోటుకి డబ్బులను చేరుస్తున్నారు.

రెండు, మూడు రోజుల ముందు నుంచే..

గతంలో ఎన్నికలకు ముందు రోజు రాత్రి మాత్రమే నగœదును పంపిణీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు..ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో రెండు మూడు రోజుల ముందుగానే ఈ క్రతువును ప్రారంభించారు. చివరి రోజు పంపిణీ చేస్తే పోలీసులు, ఎదుటి పార్టీ కార్యకర్తలు నజర్‌ వేయడం, ఏవైనా అడ్డంకులు వస్తే అన్ని ప్రాంతాల్లో పంపిణీ సకాలంలో పూర్తి కాదనే అనుమానంతో మండలాల వారీగా రెండు మూడు రోజుల నుంచి డబ్బుల పంపిణీ కొనసాగుతోంది. తొలుత తాము అనుకున్నది ఇవ్వడం, ఎదుటి పార్టీ పంపిణీ పూర్తయ్యాక దాన్ని బేరీజు వేసుకొని మరో దఫా పంపిణీ చేయడం ప్రస్తుతం అభ్యర్థులు అనుసరిస్తున్న వ్యూహం. గతంలో ఎన్నడూ ఓటరుకు నగదు పంపిణీ చేయని ఓ ప్రధాన పార్టీ సీనియర్‌ నేత ఈ దఫా పోలింగ్‌కు నాలుగు రోజులు ముందుగానే సుమారు లక్ష ఓట్లకు ఓటుకు రూ. వేయి చొప్పున డబ్బులివ్వడం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు అన్ని నియోజకవర్గాలోల హోరాహోరీ పోరు నెలకొనడంతో ఇన్ని డబ్బులు పంచినా ఎన్నికల్లో ఓటరు కరుణిస్తారో లేదోనన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని