logo

ధరావత్తు దక్కకపోయినా .. మళ్లీ పోటీ

ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఉన్న ఆర్థిక బలం వారికి ఉండదు. అయినా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. కనీసం ధరావత్తు దక్కించుకునే ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి వారిది.

Published : 07 Dec 2023 02:54 IST

కనగల్‌, న్యూస్‌టుడే: ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఉన్న ఆర్థిక బలం వారికి ఉండదు. అయినా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. కనీసం ధరావత్తు దక్కించుకునే ఓట్లు కూడా సాధించలేని పరిస్థితి వారిది. స్వతంత్ర, చిన్న పార్టీల అభ్యర్థులు కొందరు చివరి వరకు బరిలో నిలుస్తారు. మరి కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులతో మంతనాలు సాగించి .. వారికి మద్దతుగా నామినేషన్‌ ఉపసంహరించుకున్న సందర్భాలున్నాయి. ఇంకొందరు కడవరకు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. నామపత్రాలు సమర్పించేటప్పుడు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేల చొప్పున, ఇతరులు రూ10 వేల చొప్పున ధరావత్తు (డిపాజిట్‌) చెల్లించాల్సి ఉంటుంది. దీనిని తిరిగి పొందాలంటే నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ధరావత్తు వాపస్‌ ఇవ్వరు. ధరావత్తు కోల్పోయినప్పటికీ పలువురు మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉండటం గమనార్హం.

  • 2014 ఎన్నికల్లో మొత్తం 2,21,903 మంది ఓట్లకు 1,94,455 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 60,774, కంచర్ల భూపాల్‌ రెడ్డి 50,227, (స్వతంత్ర), భారాస నుంచి దుబ్బాక నర్సింహారెడ్డి 35606, భాజపా అభ్యర్థి కూతురు శ్రీనివాసరెడ్డికి 4,523, సీపీఎం అభ్యర్థి సయ్యద్‌ హషీంకు 10,332 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు ధరావత్తు  కోల్పోయారు.  
  • 2018 ఎన్నికల్లో 26 మంది నామపత్రాలను దాఖలు చేశారు. ఇందులో ఇద్దరివి తిరస్కరణకు గురికాగా.. మరో ఏడుగురు ఉపసంహరించుకున్నారు. 17 మంది బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,16,807 మంది ఓటర్లకు గాను 1,82,389 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారాస అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి 98,792 ఓట్లు సాధించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 75,094 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి షన్ముఖచారితో సహా  మొత్తం  15 మంది ధరావత్తు కోల్పోయారు.
  • 2023 ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఇందులో ముగ్గురివి తిరస్కరణకు గురికాగా.. ఆరుగురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకొన్నారు. మొత్తం 31 మంది బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 2,44,460 మంది ఓటర్లకుగాను 2.04,137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో గెలిచిన అభ్యర్థితో పాటు భారాస, ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులకు మాత్రమే ధరావత్తు దక్కింది. మొత్తం 28 మంది డిపాజిట్‌ కోల్పోయారు. ఇందులో భాజపా, సీపీఎం, తదితర పార్టీల అభ్యర్థులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు