logo

అర్హత కాదు.. అవకాశాలు ముఖ్యం

‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..నిజం మరిచి నిదుర పోకుమా...’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఉన్నత చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా,

Published : 07 Dec 2023 03:13 IST

సాధారణ ఉద్యోగాలుగా ఉన్నత విద్యావంతులు

చిట్యాల, న్యూస్‌టుడే: ‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..నిజం మరిచి నిదుర పోకుమా...’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఉన్నత చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా, ప్రభుత్వపరంగా నోటిఫికేషన్లు వెలువడని సమయంలో తమ అర్హతను పక్కన పెట్టి చేసే వృత్తిని గౌరవించాలని, తనపై ఆధారపడిన కుటుంబాలను పోషించే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావించారు ఆ యువత. ఎంఎస్సీ, ఎంఏ, బీఈడీలు పూర్తిచేసి ఉన్నత ఉద్యోగాలు మాత్రమే చేస్తామని భీష్మించుకుని కూర్చోకుండా వచ్చిన ఉద్యోగావకాశాల్ని సద్వినియోగం చేసుకున్నారు. అలా కుటుంబానికి ఆసరాగా, నిరుద్యోగ యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఉమ్మడి జిల్లా వాసులు తమ మనోభావాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.


తండ్రి స్వచ్ఛంద విరమణతో

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం ప్రొద్దటూరుకు చెందిన బొల్లా నంసింహ రైల్వేశాఖలో తన ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా 2014లో పదవీవిరమణ చేయడంతో ఆయన కొడుకు రమేష్‌కు ట్రాక్‌ మెయింటైనర్‌గా ఉద్యోగం లభించింది. రమేష్‌ 2003-05లో ఎంఏ, 2007లో బీఈడీ పూర్తిచేశారు. 2011లో రెండు సార్లు కాంట్రాక్టు లెక్చరర్‌ ఉద్యోగావకాశాలు వచ్చినా వ్యక్తిగత కారణాలతో చేరలేదు. 2014లో డీఎస్సీ, గ్రూప్‌-2 ఉద్యోగాలకు పరీక్ష రాసినా ఫలితం దక్కలేదు. బీటెక్‌, ఎంబీఏ చేసినవారు సైతం ప్రస్తుతం ఖాళీగా ఉన్నారని, ఉద్యోగాలురాలేదనే బెంగతో అనారోగ్యంపాలైన వారూ ఉన్నారని రమేష్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రాని పరిస్థితుల్లో తనపై ఆధారపడిన కుటుంబాన్ని ముందుకు నడిపించాలంటే అర్హతకుతగిన ఉద్యోగం అని కాకుండా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని భావించానని తెలిపారు. ప్రైవేటు రంగంలో ఎలాంటి ఉద్యోగమైనా అది పర్మినెంటు కాదని, అర్హతకోసం ఎదురుచూస్తే ఎటుకాకుండా పోతామని, వృత్తిని గౌరవించడం మంచి మార్గమని రమేష్‌ అంటున్నారు.


ఎక్కువ పోస్టులు ఉన్నాయని..

నాగార్జునసాగర్‌కు చెందిన నాగుల సరళ చిట్యాల సెక్షన్‌ పరిధిలోని నల్గొండలో 2013 నుంచి ట్రాక్‌ మెయింటైనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2006-07లో బీఈడీ, 2010-12లో ఎంజీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ పూర్తిచేశారు. ఉద్యోగాన్వేషణలో భాగంగా 2011లో రైల్వే నోటిఫికేషన్‌ ప్రకటన రాగా ఎక్కువ పోస్టులు ఉన్నాయనే ఉద్దేశంతో ట్రాక్‌ మెయింటైనర్‌ పోస్టుకు ఆప్షన్‌ ఇచ్చారు. ఉద్యోగం వచ్చి విధుల్లోచేరే వరకు ఇది క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఉద్యోగమని తెలియదని పేర్కొన్నారు సరళ. ఉద్యోగం వచ్చిన ఆరంభంలోనే వివాహం జరగడం, మూడు, నాలుగేళ్లపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు లేకపోవడంతో ఇందులోనే ఆమె కొనసాగారు. 2016లో గురుకుల డిగ్రీ లెక్చరర్‌ పోస్టుకు పరీక్ష రాసినా మెయిన్స్‌లో విఫలం కావడంతో ఉద్యోగం దక్కలేదు. టీఎస్‌పీఎస్సీ ఈ ఏడాది గతనెలలో నిర్వహించిన జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుకోసం పరీక్ష రాసినట్లు సరళ పేర్కొన్నారు. ఉద్యోగ నిర్వహణలో క్షేత్రస్థాయికి వెళ్లి రావడం, ఇంటిపని చూసుకోవడంతో ఇతర పోస్టులకు సన్నద్ధం కావడం కూడా కష్టమవుతోందని తెలిపారు. అయినా ఉద్యోగం ఏదైనా క్రమశిక్షణగా చేయగలిగితే అందులోనే గుర్తింపు లభిస్తుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.


ఇతరత్రా పోల్చుకోవద్దు

ఇతరులు చేసే ఉద్యోగాలతో పోల్చుకుని మనల్ని మనమే తక్కువ చేసుకోవద్దంటున్నారు సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరికి చెందిన కె.వెంకటేశ్వర్లు. ఎంఎస్సీ, బీఈడీ పూర్తిచేసిన వెంకటేశ్వర్లు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను అకస్మాత్తుగా ప్రకటించడంతో సన్నద్ధతకు సమయం సరిపోక ఉద్యోగాన్వేషణ సఫలీకృతం కాలేదు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో దక్షిణమధ్య రైల్వే జోన్‌లో 8వేల ట్రాక్‌ మెయింటైనర్‌ పోస్టుల ఉద్యోగ ప్రకటన రావడంతో దానికి హాజరై ఉద్యోగాన్ని 2013లో సాధించారు. ప్రస్తుతం నల్గొండలో విధులు నిర్వర్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగం చేయగలనా, లేదా అనే సందిగ్ధం కలిగినా నెమ్మదిగా అలవాటు పడిపోయాను. ఇంట్లో ఎక్కువ చదువుకున్నవారులేరు. నాకు ఉద్యోగం వస్తే కుటుంబానికి కూడా ధైర్యంగా ఉంటుందని ఇందులో చేరాను. చేసే ఉద్యోగం చిన్నదా, పెద్దదా అని ఆలోచిస్తూ కూర్చోవద్దు, అలా మేము ఈ ఉద్యోగంలో చేరినపుడు మాట్లాడినవారు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నారు.


అర్హతలెన్ని ఉన్నా ఖాళీగా ఉన్నారు

తనకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న వారు చాలా మంది ఉద్యోగ అవకాశాలు లభించక  ఖాళీగా ఉన్నారంటున్నారు నకిరేకల్‌ మండలం నోములకు చెందిన బాదిని శ్రీనివాస్‌గౌడ్‌. ఆయన 2015 నుంచి చిట్యాల సెక్షన్‌ పరిధిలో ట్రాక్‌ మెయింటైనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన 2006-2014 కాలంలో రెండు ఎమ్మెస్సీలు చేశారు. మధ్యలో బీఈడీ(2009-10) పూర్తిచేశారు. గ్రూప్‌-2 పరీక్షలకు ముందస్తుగా సన్నద్ధమవుతున్న తరుణంలో రైల్వే పోస్టుల నోటిఫికేషన్‌ వెలువడడంతో, అది రాసి, ట్రాక్‌మెయింటైనర్‌ ఉద్యోగంలో చేరారు. సోదరి వివాహం కాగా, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తానే ఇంటికి పెద్ద కావడంతో కుటుంబం పట్ల తనపై బాధ్యత, ఆర్థిక అవసరాలు, అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువరించకపోవడం, వయసు పెరిగిపోతుండడం, ఇంట్లో, బయటా తనపై పెరిగిన ఒత్తిడి రైల్వేశాఖలో ఉద్యోగం స్వీకరించేలా చేశాయని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ‘ఎక్కువ విద్యార్హతలు ఉన్న తన సహచరులు తక్కువ వేతనాలకు ప్రైవేటు రంగంలో విధిలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న తీరు చూస్తే తన విద్యార్హతలకు తాను చేస్తున్నది తక్కువ స్థాయి ఉద్యోగమైనా జీవితంలో స్థిరపడగలిగే వీలుంది. శాఖ పరమైన పరీక్షలు రాసి పై ఉద్యోగానికి వెళ్లే అవకాశాలూ ఉన్నాయి. స్థాయిని కాకుండా చేసే వృత్తిని గౌరవించాలి. అందుకే ఈ ఉద్యోగంలో చేరాను.’ అని పేర్కొన్నారు శ్రీనివాస్‌గౌడ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని