logo

పరీక్ష నెగ్గితే ఉపకార వేతనం

ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు చదువును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఏటా నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పేరిట పరీక్ష నిర్వహిస్తూ అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఐదేళ్ల పాటు ఉపకార వేతనం అందిస్తూ ప్రోత్సహిస్తోంది.

Published : 07 Dec 2023 03:22 IST

10న ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష 
సన్నద్ధమవుతున్న విద్యార్థులు
సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే

ర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు చదువును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఏటా నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పేరిట పరీక్ష నిర్వహిస్తూ అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఐదేళ్ల పాటు ఉపకార వేతనం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. పరీక్షలో ఎంపికయిన ప్రతిభావంతులకు ఇంటర్‌ పూర్తయ్యే వరకు ఉపకార వేతనం అందిస్తారు. ఈ పరీక్ష రెండు దశల్లో మెంటల్‌ ఎబిలిటీ (ఎంఏటీ), స్కాలస్టిక్‌్ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ) నిర్వహిస్తున్నారు. వీటిల్లో మెరిట్ ఆధారంగా ఉపకార వేతనానికి ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులు. ఈ సంవత్సరం పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 10వ తేదీన పరీక్ష నిర్వహించనుండటంతో దరఖాస్తుదారులు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది ఎంపికైన వారి సూచనలు, సలహాలు తీసుకుంటూ పట్టుదలతో సిద్ధమవుతున్నారు. హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థులు యూసర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా http//bse.telangana.gov.in  వెబ్‌సైట్లో హాల్‌టికెట్లను పొందవచ్చు. పరీక్ష సమయానికి ఒక గంట ముందే హాజరు కావాలని అధికారులు సూచించారు.


పరీక్షకు హాజరుకానున్న 1,050 మంది విద్యార్థులు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1050 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష రాయనున్నారు. గత సంవత్సరం 1,120 మంది పరీక్ష రాయగా వీరిలో 74 మంది ఉపకార వేతనానికి ఎంపికయ్యారు. వీరికి ఏటా రూ.12 వేల చొప్పున విడతల వారీగా అందిస్తున్నారు. విద్యార్థులకు నేరుగా ఆధార్‌ కార్డు ద్వారా తీయించిన బ్యాంకు ఖాతాలో జమయ్యేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా బ్యాంకు ఖాతా నంబర్ల పరిశీలన చేసుకుని అందించాల్సి ఉంటుంది. పరీక్ష రాయబోయే విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సూచనలు తీసుకుని సన్నద్ధమైతే ఎంపిక సులువు అవుతుందని విజేతలు చెబుతున్నారు.


సందేహాలు నివృత్తి చేసుకోవాలి
హేమ, తొమ్మిదో తరగతి, ఎన్‌ఎంఎంఎస్‌ విజేత, పాలవరం, అనంతగిరి

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవాలి. ఈ పరీక్షకు ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అదనంగా రోజుకు మూడు, నాలుగు గంటల పాటు చదవాలి. ఏ చిన్న సందేహం కలిగిన వెంటనే నివృత్తి చేసుకుంటే వెంటనే గుర్తుంటుంది.


గణితం సాధన చేస్తే మేలు
-నందిని, తొమ్మిదో తరగతి, ఎన్‌ఎంఎంఎస్‌ విజేత, పాలవరం, అనంతగిరి

గణితంలోని సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి. మిగతావి చదివితే గుర్తుంటుంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటించాలి. గత పరీక్ష పేపర్‌ను ఒకటికి రెండు సార్లు చదవాలి. దాని ప్రకారం ప్రశ్నలను తయారు చేసుకుని చదివితే చాలా మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని