logo

పార్టీలు మారి.. విజేతగా నిలిచి

రాజకీయ నాయకుల లక్ష్యాల్లో ఒకటి ప్రజాప్రతినిధిగా ఎంపికవడం. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగినా.. పదవులు దక్కకుంటే మరో పార్టీలోకి వెళ్లడం సహజం.

Updated : 07 Dec 2023 04:44 IST

తుంగతుర్తి, న్యూస్‌టుడే: రాజకీయ నాయకుల లక్ష్యాల్లో ఒకటి ప్రజాప్రతినిధిగా ఎంపికవడం. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగినా.. పదవులు దక్కకుంటే మరో పార్టీలోకి వెళ్లడం సహజం. పార్టీ మారడంతో పాటు ఎమ్మెల్యే టికెట్‌ సాధించి తాజా ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మన్ననలతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేల్‌


మాతృపార్టీలో చేరి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు శాసనసభ స్థానానికి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సీనియర్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. తర్వాత పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరడంతో ఆ నియోజకవర్గానికి మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఎకాఎకిన భాజపాలో చేరి ఆ పార్టీ నుంచి మళ్లీ ఎన్నికల బరిలో నిల్చొని ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కొన్ని మాసాలకే అసెంబ్లీ ఎన్నికలు రావటంతో రాజగోపాల్‌రెడ్డి వెంటనే భాజపా నుంచి మాతృపార్టీ కాంగ్రెస్‌లోకి చేరారు. ఏకంగా ఆ పార్టీ టికెట్‌ తెచ్చుకొని ఎన్నికల బరిలో నిలిచి మళ్లీ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.


ఉద్యమ నేతగా ఎదిగి..

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ్యుడిగా ఉండి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ఒకరు మందుల సామేల్‌. ఈయన తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రామగ్రామం తిరిగి అప్పటి తెరాస(భారాస)ను బలోపేతం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు తుంగతుర్తి నుంచి తెరాస టికెట్‌ తెచ్చుకోలేక పోయారు. మూడోసారి కూడా భారాస అధిష్ఠానం సిట్టింగ్‌లకే టికెట్‌ కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో, తిరుమలగిరిలో జరిగిన భారాస ప్రగతి నివేదన సభలో గాదరి కిశోర్‌కుమార్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో 40 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను కేటీఆర్‌ కోరారు. దీంతో తనకు భారాసలో గుర్తింపు లేదని, అసెంబ్లీ ఎన్నికలకు టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేదని గ్రహించి సామేల్‌ వెంటనే కాంగ్రెస్‌లోకి చేరారు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల తర్వాత ఆఖరి గడియల్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అధిష్ఠానం సామేల్‌ను ప్రకటించి టికెట్‌ ఇచ్చింది. ఆ ఉత్సాహంతోనే నామినేషన్‌ పత్రాల దాఖలు చేసి, తిరుమలగిరిలో సమర శంఖారావం సభ నిర్వహించారు. భారీగా తరలొచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆయనకు అండగా నిలిచారు. నియోజకవర్గ ప్రజలూ తెలంగాణ ఉద్యమ నేతగా ఆదరించడంతో 51 వేల ఓట్ల మెజార్టీతో భారాస అభ్యర్థిపై మందుల సామేల్‌ ఘనవిజయం సాధించారు. త్వరలో అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని