logo

విన్నపాలు విన్నారు.. పరిష్కరించారు

సూర్యాపేట నియోజకవర్గంలోని ఉండ్రుగొండ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ఆస్తులకు పార్టీల గుర్తులు వేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా కరపత్రాలు విద్యుత్తు స్తంభాలకు అతికిస్తున్నారని ఫిర్యాదు అందింది.

Published : 07 Dec 2023 03:44 IST

సత్ఫలితాలనిచ్చిన కంట్రోల్‌ రూం
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే

సూర్యాపేట కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌

సూర్యాపేట నియోజకవర్గంలోని ఉండ్రుగొండ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ఆస్తులకు పార్టీల గుర్తులు వేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా కరపత్రాలు విద్యుత్తు స్తంభాలకు అతికిస్తున్నారని ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన అధికారులు అక్కడికి వెళ్లి కరపత్రాలు తొలగించారు.


తుంగతుర్తి నియోజకవర్గంలో ఓ పార్టీ ప్రజాప్రతినిధి ఇంట్లో అక్రమంగా మద్యం, చీరలు నిల్వ ఉంచి పంపిణీ చేపడుతున్నారని కొందరు సీ విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారులకు సీ విజిల్‌ సిబ్బంది సమాచారం అందించగా వారు అక్కడికి వెళ్లి వెంటనే నిలుపుదల చేసి సమస్యను పరిష్కరించారు.


న్నికలను పకడ్బందీగా చేపట్టేందుకు, క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పరిష్కరించడానికి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా 1950 కాల్‌సెంటర్‌, సీ విజిల్‌, ఎన్జీఆర్‌ఎస్‌ యాప్‌లను అందుబాటులో తీసుకొచ్చారు. అక్టోబరు 10న ప్రారంభమైన ఈ కాల్‌ సెంటర్లలో నిత్యం మూడు షిఫ్టుల్లో సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఓటర్లకు ఎలాంటి సందేహాలు తలెత్తినా, నివృత్తి చేశారు. ఓటు ఎక్కడ ఉందో అని ఫిర్యాదు చేస్తే.. ఆ వివరాలు తెలిపారు. ఇంకా ఎన్నికల పరంగా నిత్యం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు.

1950 ద్వారా..

ఓటు ఎక్కడ ఉంది.. ఓటు ఒక చోటు నుంచి మరో చోటుకు మారినా.. ఓటరు జాబితాలో తమ పేరు లేకుంటే ఫిర్యాదు చేసుకునేలా 1950 కాల్‌సెంటర్‌ను రూపొందించారు. ఓటరు జాబితాలో పేరు అచ్చుతప్పులుండటం.. ఒక పోలింగ్‌ కేంద్రం బదులు, మరో కేంద్రంలో నమోదు కావడంపై ఓటర్ల నుంచి ఎక్కువగా ఫిర్యాదు అందాయి. ప్రజల నుంచి వివిధ రకాల ఫిర్యాదు అందిన వెంటనే సిబ్బంది వివరాలు నమోదు చేసుకుని సంబంధిత బీఎల్వోలకు చేరవేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు.

సీ విజిల్‌

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గ్రామాల్లో ఒక పార్టీకి సంబంధించి గుర్తులు కనిపించినా.. రాజకీయ నాయకుల విగ్రహాలకు తెరలు వేయకున్నా ఫొటో తీసి సీ విజిల్‌కు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు వివరించి పరిష్కరించేలా చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు ఎవరైనా పార్టీలకు కోసం పని చేసినా ఫిర్యాదు చేసేలా దీనిని తయారు చేశారు. వివిధ శాఖల్లో పనిచేసే ఐదుగురు ఉద్యోగులపై సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు రావడంతో వెంటనే వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

ఎన్‌జీఆర్‌ఎస్‌ యాప్‌

పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారానికి, ర్యాలీలు, సభలు, సమావేశాలకు ముందుగా అనుమతులు తీసుకునేందుకు ఎన్‌జీఆర్‌ఎస్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలి. లేదా నేరుగా కలెక్టర్‌కు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు. అనుమతులు తీసుకోకుంటే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా అనుమానాలు, సందేహాలున్నా ఈ యాప్‌లో నమోదు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.

పకడ్బందీగా పరిష్కారం

1950 కాల్‌సెంటర్‌, సీ విజిల్‌, ఎన్జీఆర్‌ఎస్‌ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే 100 నిమిషాల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా పకడ్బందీగా ఎన్నికల అధికారులు, సిబ్బంది ముందుకు సాగారు. సెలవు రోజుల్లోనూ అందుబాటులో ఉన్నారు. వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపి.. వాటి వివరాలపై నివేదిక తయారు చేసి ఎన్నికల సంఘానికి పంపేలా ఏర్పాట్లు చేపట్టారు. పరిష్కారం కాని వాటిని క్షేత్రస్థాయిలో ఎందుకు కాలేదో ఆరా తీశారు. ముఖ్య నాయకులు సభలకు హాజరయ్యేందుకు హెలికాఫ్టర్లలో వస్తుండగా ముందస్తుగా అనుమతులు తీసుకోవాలి. హెలికాఫ్టర్‌, హెలీప్యాడ్‌ల అనుమతుల కోసం 15 దరఖాస్తులు రాగా అందులో 14కు అనుమతులు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని