logo

రెవెన్యూ డివిజన్‌ కల సాకారమయ్యేనా..?

ఆలేరు పరిసర ప్రాంతాల ప్రజలు దశాబ్దాల కాలంగా పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది.

Published : 07 Dec 2023 03:51 IST

ఆలేరు పట్టణం

ఆలేరు, న్యూస్‌టుడే: ఆలేరు పరిసర ప్రాంతాల ప్రజలు దశాబ్దాల కాలంగా పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది. ఇటీవల ఎన్నికల్లోనూ ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ప్రధాన అంశంగా మారింది. స్థానికంగా జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో కాంగ్రెస్‌, భారాస ముఖ్య నేతలు కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు స్పష్టమైన హామీనిచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో.. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీడియాతో మాట్లాడారు. ఇచ్చినహామీ మేరకు ఆలేరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. నియోజకవర్గంలోని యాదాద్రి ప్రపంచ స్థాయి క్షేత్రంగా అభివృద్ది జరిగిన క్రమంలో.. ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి కొత్త శోభ చేకూరుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.

ఐదు మండలాలతో ప్రతిపాదనలు..  

ఆలేరు రెవెన్యూ డివిజన్‌ను కోరుతూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత 2021 మార్చిలో ప్రభుత్వానికి లేఖను అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పటి జిల్లా పాలనాధికారి అనితా రాంచంద్రన్‌ ఆలేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు ఆవశ్యకత, భవిష్యత్తులో అభివృద్ధి తీరును వివరిస్తూ 31.5.2021న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆలేరు రెవెన్యూ డివిజిన్‌ పరిధిలోకి ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, మోటకొండూరు, గుండాల మండలాలను చేర్చుతూ అప్పట్లో ప్రతిపాదనలు పంపించారు. ఈ మండలాలకు ఆలేరు పట్టణం కేంద్రంగా ఉంది.

పరిపాలన సౌలభ్యం కోసం...

ప్రస్తుతం ఉన్న భువనగిరి డివిజన్‌లో 12 మండలాలు ఉండడంతో.. ప్రజలకు సంబంధించి డివిజన్‌ స్థాయిలో జరగాల్సిన పనుల్లో జాప్యం జరుగుతోంది. రెవెన్యూ డివిజన్‌లో ప్రతిపాదిత మండలాలు భౌగోళికంగా ఆలేరుకు సమీపంలో ఉన్నాయి. ఆలేరు పట్టణం హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ఉండడం, రైల్వేస్టేషన్‌ ఉండడం, కొలనుపాకలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జైన ఆలయం, సోమేశ్వరాలయం, ఆర్కియాలజీ మ్యూజియం, యాదాద్రి పుణ్య క్షేత్రం ఉండడం ఆలేరుకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని