logo

జిల్లాలో 3.02 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

నల్గొండ జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే వరకు అధికారులు సరైన ఏర్పాట్లు చేశారు.

Published : 07 Dec 2023 03:56 IST

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే వరకు అధికారులు సరైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల నుంచి పౌరసరఫరా శాఖ అధికారులను తప్పించి పూర్తిగా ధాన్యం సేకరణ కోసమే నియమించారు. ప్రతి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు అధికారులకు సవాల్‌గా మారుతున్నాయి. వాహనాలు రాకపోవడం, తూకాలు ఆలస్యం కావడం, అదనంగా ధాన్యాన్ని తూకం వేస్తున్నారంటూ కర్షకులు ఆందోళనలు, ధర్నాలకు దిగిన ఘటనలుండేవి. అయితే ఈ సీజన్‌లో కొనుగోళ్లు సజావుగా నడిచినా ఇంకా కొన్ని చోట్లా ఆలస్యం అవుతున్నాయి. దీంతో కేంద్రాల్లో ఉన్న ధాన్యం మిగ్‌జాం ప్రభావంతో తడిశాయి. మళ్లీ వాటిని తేమశాతం తగ్గడం కోసం ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. వానాకాలంలో 5,05,280 ఎకరాల్లో వరిసాగు చేయగా అక్టోబరు నుంచి వరికోతలు చేపట్టారు. కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వచ్చినా సేకరణ అక్టోబరు చివరి వారంలో చేపట్టారు. ఇప్పటి వరకు 3,02,158 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రూ.598 కోట్లు రైతులకు చెల్లించారు. జిల్లాలో ప్యాక్స్‌, ఐకేపీ, డీసీఎంఎస్‌, రైతు సంఘాల ఆధ్వర్యంలో 237 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 191 కొనుగోలు  కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నా.. అక్కడ ఆలస్యం రైతులను వేధిస్తుంది.

మిగ్‌జాంతో ఆగిన కొనుగోళ్లు..

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మిగ్‌జాం తుపాన్‌ కారణంగా నిలిచిపోయాయి. మూడునాలుగు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు చేయకపోవడంతో రైతులు తమ ధాన్యం తడవకుండా చర్యలు తీసుకున్నారు. టార్పాలిన్లు కప్పి ఉంచారు. వర్షాలు తగ్గిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు మొదలు పెడతామని .. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని పౌరసఫరాల సంస్థ డీఎం నాగేశ్వర్‌ రావు తెలిపారు.

ప్రెవేటుగా అమ్మకం..

ఆలస్యంగా కేంద్రాలు మొదలు కావడం వల్ల ముందు కోతకు వచ్చిన ధాన్యం రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయించారు. మిల్లులు సైతం పచ్చి ధాన్యం క్వింటా రూ.2వేల వరకు కోనుగోలు చేసింది. ప్రభుత్వ సేకరణ జాప్యంతో కొందరు రైతులపై ప్రెవేటుగా అమ్ముకున్నారు. యాసంగి సీజన్‌ మొదలు ధ్యానం డబ్బులు సమయానికి రాకపోగా, రైతుబంధు సాయం అందకపోవటం తదితర కారణాలతో పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల కారణంగా కొంత జాప్యం జరిగినా.. ప్రస్తుతం అధికారులు అప్రమత్తమై రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేసి.. సకాలంలో డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఇక వానాకాలం సీజన్‌లో సన్నరకాలకు డిమాండ్‌ ఉండటంతో బహిరంగ మార్కెట్‌లోనే ఎక్కువగా విక్రయించారు. ముఖ్యంగా మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, నల్గొండ ప్రాంతాల్లో సన్నాలను బయట విక్రయించారు. చాలా చోట్ల వ్యాపారులు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేశారు. మరి కొందరు మిల్లుల్లో విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని