logo

ఇక పంచాయతీల్లో ఎన్నికల పండగ..!

గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 07 Dec 2023 03:59 IST

కసరత్తు షురూ
ఫిబ్రవరి 1తో ముగియనున్న పదవీ కాలం

గ్రామపంచాయతీ భవనం

భువనగిరి పట్టణం, నల్గొండ జిల్లా  పరిషత్తు, గరిడేపల్లి, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్‌కు అవసరమైన సిబ్బందిని సమకూర్చి వారి వివరాలను టీపోల్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. నియామక ప్రక్రియను ఈ నెల 30లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామ సర్పంచుల పదవీ కాలం 1.2.24తో ముగియనుంది. పదవీ విరమణకు మూడు నెలల ముందుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఒక్కో జిల్లాలో మూడు విడతలుగా పోలింగ్‌ నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది.

పోలింగ్‌ సిబ్బంది ఇలా....

ఎన్నికలకు అవసరమయ్యే సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేసింది. 200 ఓటర్లు ఉన్న గ్రామపంచాయతీకి ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారిని నియమించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించింది. 400 ఓటర్ల వరకు ఒక పీవో, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 650 ఓట్లు ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ఒక పీవో, ముగ్గురు పోలింగ్‌ అధికారులను నియమించాలని కమిషన్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.

గడువులోపు జరిగేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గతంలో ఖరారు చేసిన రిజర్వేషన్లు పదేళ్ల వరకు వర్తిస్తాయని ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో పాత రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయా, లేక కొత్త ప్రభుత్వం చట్టాన్ని మార్చుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. చట్టంలో మార్పులు జరిగిన పక్షంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ రిజర్వేషన్లను చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల్లో కూర్పు చేసిన ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ జాబితాను గ్రామ పంచాయతీల, వార్డుల వారీగా విభజించాల్సి ఉంటుంది. జాబితా తయారు చేయడంతో పాటు అభ్యంతరాలు స్వీకరించడం, తుది ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు కనీసం నెల రోజుల వ్యవధి పడుతుందని అధికారులు చెబుతున్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ల సమీకరణతో పాటు బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్నికల పనులు పూర్తి చేసేందుకు గడువు చాలదన్న భావన అధికార వర్గంలో ఉంది. దీంతో ఎన్నికలు అనుకున్న సమయంలో జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలకు అవసరమయ్యే బడ్జెట్‌పై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సమావేశం ఇప్పటికే జరిగింది. జిల్లాల వారీగా ప్రతిపాదనలు ఉన్నతాధికారులు అడిగినట్లు సమాచారం.

మళ్లీ మొదలవబోతోంది వేడి

వచ్చే ఏడాది ప్రారంభంలోనే మళ్లీ ఎన్నికల వేడి పుట్టనుంది. గ్రామ పంచాయతీ, పార్లమెంటు, మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలు వరుసగా జరుగనుండటంతో గ్రామాల్లో ఏడాది పాటు ఎన్నికల పండగ వాతావరణం నెలకొననుంది. గత ఐదేళ్లుగా పదవులకు దూరంగా ఉన్న నేతలు అప్పుడే ఎన్నికలపై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో  ఎక్కువ సంఖ్యలో భారాసకు చెందిన ప్రజాప్రతినిధుల చేతుల్లోనే పాలనా పగ్గాలున్నాయి. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో 12 నియోజకవర్గాలుండగా 11 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవడంతో అ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని