logo

మరిన్ని నీళ్లు పోశాం.. మంచి ఫలాలివ్వాలి మరి!

మీరు మొక్కలు నాటారు. ఆ మొక్కలకు మాతో నీళ్ల పోయించారు.  అవి బాగా ఎదిగి చెట్లయ్యాయి. కొత్త పంట కాలం వచ్చింది కదా. మాకూ బాగా ఫలాలివ్వాలి’

Published : 07 Dec 2023 04:02 IST

మీరు మొక్కలు నాటారు. ఆ మొక్కలకు మాతో నీళ్ల పోయించారు.  అవి బాగా ఎదిగి చెట్లయ్యాయి. కొత్త పంట కాలం వచ్చింది కదా. మాకూ బాగా ఫలాలివ్వాలి’

ఇదీ ఉమ్మడి నల్గొండ జిల్లా 12 అసెంబ్లీ   నియోజకవర్గాల్లో దాదాపు 25 లక్షల మంది జనం తాజా ఆకాంక్ష!


వీరి బలమైన ఆకాంక్ష వెనక కథ ఇదే..

ఐదేళ్లకొకసారి వచ్చే పంటల సీజన్‌ (అసెంబ్లీ ఎన్నికలు) వచ్చింది ఈ మధ్యనే కదా. కొన్ని కంపెనీ (రాజకీయ పార్టీ)ల యాజమాన్యం (అధినేతలు) జనం (ఓటర్ల) మధ్యకు వచ్చి వారి కంపెనీ (పార్టీ) మొక్కల (అభ్యర్థుల)ను చూపిన విషయం తెలిసిందే. జనం (ఓటర్ల) మధ్య వారి ప్రతినిధుల (పార్టీ నాయకుల) సహకారంతో.. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ మొక్కల (అభ్యర్థుల)ను నాటారు (పరిచయం చేశారు). ఇతర మొక్క (స్వతంత్రు)లతో కలిపి మొత్తం నాటినవి (పరిచయం చేసిన వారి సంఖ్య) 276. తమ మొక్కల (పార్టీ అభ్యర్థుల)కు బాగా నీళ్లు పోసి (ఓట్లు వేసి) పెద్ద చేసి (ఎమ్మెల్యేగా గెలిపించి) అప్పగిస్తే చాలని, ఫలాల (సంక్షేమ పథకాల)ను ఆ ఎదిగిన పండ్ల మొక్కల (ఎమ్మెల్యేల) ద్వారానే అందించే బాధ్యత తమదని కంపెనీల పెద్దలు (అధినేతలు) హామీలిచ్చారు. రెండు కంపెనీ (పార్టీ)ల వారి మాటల్నే జనం (ఓటర్లు) గట్టిగా నమ్మారు. 12 నియోజకవర్గాల్లో 25 లక్షల మంది కలిసి.. ఒక కంపెనీ (పార్టీ) 11 మొక్కల (అభ్యర్థుల) కు బాగా నీళ్లు పోశారు (ఓట్లు వేశారు). మరో కంపెనీ (పార్టీ) ఒక మొక్క (అభ్యర్థి) కి నీళ్లు (ఓట్లు) కాస్త తక్కువే. నవంబరు 30న మధ్యవర్తి (ఎన్నికల సంఘం) పరిశీలించి, ఎదిగిన మొక్కల శక్తి (ఎమ్మెల్యే ఓట్ల) ని డిసెంబరు 3వ తేదీన వెల్లడించింది. ఈ సీజన్‌ (ఎన్నిక)లో ఉమ్మడి జిల్లాలో బాగా ఎదిగిన పండ్ల మొక్కల (ఎమ్మెల్యేల) కంపెనీ (పార్టీ)కే ఐదేళ్ల పేటెంట్‌ హక్కు (ప్రభుత్వం) దక్కింది. ఈ పండ్ల మొక్క (ఎమ్మెల్యే)ల పంటకాలం (పదవీకాలం) ఐదేళ్లే. ఇక ఈ కంపెనీ యాజమాన్యం (ప్రభుత్వ పార్టీ), ఈ పండ్ల మొక్కలు (ఎమ్మెల్యేలు) ఎంతటి మధురమైన (సంక్షేమ పథకాల) ఫలాలను ఏ మేరకు ప్రజల చేతికి అందించేనో వేచిచూద్దాం మరి!

‘ మేం పెంచి పెద్ద చేసిన 11 పండ్ల మొక్కల (ఎమ్మెల్యేల) కంపెనీ (కాంగ్రెస్‌ పార్టీ)కే పేటెంట్‌ హక్కు (ప్రభుత్వం) వచ్చింది. మంచి ఫలాలివ్వాలి. గత సీజన్‌ (ఎన్నిక)ల్లో మా నీళ్ల (ఓట్ల) తో ఎదిగిన పండ్ల మొక్క (ఎమ్మెల్యే)లు తెగుళ్ల (నిర్లక్ష్యం)తో ఫలాల (సంక్షేమ పథకాల) ను సరిగా పంచలేదు. తప్పనిసరై ఆ చెట్ల (అభ్యర్థుల) ను మే (ఓటర్ల)మే కొట్టేయాల్సి (ఓడించాల్సి) వచ్చింది మరి.’ అని ఇదే సందర్భంలో ఉమ్మడి నల్గొండ జిల్లా జనం (ఓటర్లు) హెచ్చరిస్తున్నారు కూడా!!

న్యూస్‌టుడే, మేళ్లచెరువు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని