logo

అమాత్యయోగం ఎంతమందికో..?

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంత మందికి అమాత్యయోగం దక్కనుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది.

Updated : 07 Dec 2023 04:41 IST

నేడు మంత్రులుగా ఉత్తమ్‌, కోమటిరెడ్డి ప్రమాణం?
ఉప ఎన్నికలు లేనట్లే

ఈనాడు, నల్గొండ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంత మందికి అమాత్యయోగం దక్కనుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ సీనియర్‌ నాయకులుగా ముద్రపడిన నల్గొండ, భువనగిరి ఎంపీలు, తొలి నుంచి రేసులో ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌, నల్గొండ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డిలకు కేబినేట్‌ బెర్త్‌లు ఖాయమేనని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నెండింటిలో 11 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ గెలవడంతో సీనియర్‌ నేతలతో పాటూ సామాజిక సమీకరణాల నేపథ్యంలో మరికొంత మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. దీంతో నేడు కొలువుదీరబోయే సర్కారులో ఎంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీనియర్‌ నేత, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి సైతం దిల్లీ వర్గాల్లో ఉన్న తన పలుకుబడిని ఉపయోగించి రానున్న ప్రభుత్వంలో కీలక పదవీపై చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

వారిద్దరికీ కీలక బాధ్యతలు

ముఖ్యమంత్రి పదవీకి తననూ పరిగణనలోకి తీసుకోవాలని కోరిన పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత మూడు రోజులుగా దిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. రానున్న ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పజెబుతామని హైకమాండ్‌ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో నేడు జరగబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఇప్పటికయితే ఉమ్మడి జిల్లా నుంచి వీరిద్దరికీ అమాత్యయోగం పక్కాగా ఖరారైంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతలకు మరో పదవీ ఇచ్చే ఆలోచన చేస్తే దేవరకొండ, నకిరేకల్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన బాలునాయక్‌, వేముల వీరేశంలలో ఒకరికి పదవీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం దిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో మంత్రి పదవీకి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇప్పటికే ఆయన పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు.


నాలుగు నెలలు ఉండటంతో..

నల్గొండ, భువనగిరి ఎంపీలుగా ఉన్న ఉత్తమ్‌, కోమటిరెడ్డి  తాజా ఎన్నికల్లో హుజూర్‌నగర్‌, నల్గొండ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఉత్తమ్‌ ఎంపీ పదవీకి రాజీనామా చేస్తూ స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా చేస్తూ దిల్లీలో అందజేసినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి సైతం రాజీనామా చేయనున్నారు. అయితే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితులు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనల ప్రకారం పార్లమెంటు గడువు ఆరు నెలల కంటే తక్కువగా ఉన్నప్పుడు సిట్టింగ్‌ ఎంపీ రాజీనామా చేసినా ఎన్నికలు పెట్టే పరిస్థితులు లేవు. పార్లమెంటు ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్నాయి. దీంతో నాలుగు నెలలే గడువు ఉన్నందునా ఇప్పడు వీరిద్దరు రాజీనామా చేసినా ఉప ఎన్నికల ప్రశ్నే ఉండదని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు ‘ఈనాడు’కు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని