logo

వివాహిత దారుణ హత్య

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది.

Published : 08 Dec 2023 02:52 IST

తిప్పర్తి, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామ శివారులో బసిరెడ్డిపల్లికి వెళ్లే రహదారిలో మహిళ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్సై ధర్మ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు నల్గొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన మంజుల(35)గా పోలీసులు గుర్తించారు. ఈమె నల్గొండలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలోని వసతిగృహంలో వంట పనిచేస్తున్నారు.  ఆ మహిళ మెడకు నలుపు రంగు చున్నీ బిగించి రాళ్లు, ఇతర ఆయుధాలతో తలపై మోది హత్య చేశారు. మహిళ పసుపు రంగు టాప్‌, నలుపురంగు ప్యాంట్‌ ధరించి ఉంది. కాళ్లకు వెండి పట్టీలు, వెండి మెట్టెలు ఉన్నాయి. క్లూస్‌ టీం, సీసీఎస్‌ టీం సభ్యులు పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రాఘవరావు తెలిపారు. హత్యకు సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉన్నట్లు ఎస్సై చెప్పారు.


చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉద్యోగికి జైలు

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: చెల్లని చెక్కు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగికి జైలుశిక్ష విధిస్తూ సూర్యాపేట ప్రధాన ప్రథమశ్రేణి న్యాయమూర్తి కామిశెట్టి సురేశ్‌ గురువారం తీర్పుచెప్పారు. నడిగూడెం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన చల్లా రాజశేఖర్‌ ప్రభుత్వ ఉద్యోగి. తన అవసరాల నిమిత్తం పలు సందర్భాలలో సూర్యాపేట పట్టణానికి చెందిన కట్టా దయాకర్‌ వద్ద రూ.4.45 లక్షలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించే నిమిత్తం అదే మొత్తానికి చెక్కు జారీ చేశాడు. వసూలు నిమిత్తం చెక్కును బ్యాంకులో జమచేయగా నిందితుడు రాజశేఖర్‌ ఖాతాలో నగదు నిల్వలు లేని కారణంగా చెక్కు చెల్లుబాటు కాలేదు. నోటీసు ఇచ్చినా ఫలితం లేకపోవటంతో బాధితుడు దయాకర్‌ న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితుడు రాజశేఖర్‌ ఉద్దేశపూర్వకంగా చెల్లని చెక్కు ఇచ్చినట్లు నిర్ధారించి జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. చెక్కుకు రెట్టింపు మొత్తం రూ.8.9 లక్షలు బాధితుడికి పరిహారంగా చెల్లించాలని నిందితుడిని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని