logo

ఆయుష్మాన్‌ భవలో.. ప్రైవేటు ఆసుపత్రుల నమోదు

గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్‌భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు.

Published : 08 Dec 2023 02:58 IST

మిర్యాలగూడలో ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న డాక్టర్స్‌ కాలనీ

మిర్యాలగూడ , న్యూస్‌టుడే: గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్‌భవ కార్యక్రమాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయనున్నారు. నిర్ణీత విధానంలో తమ ఆసుపత్రుల వివరాలను ఆయుష్మాన్‌ భవ విభాగంలో నమోదు చేసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం వర్తింపజేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ కార్యక్రమాన్ని కొంత ఆలస్యంగా అనుమతించింది. దీంతో ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల వారు సైతం ‘ఆరోగ్య సౌకర్యాల నమోదు’ ‘ఆరోగ్య ప్రొఫెషనల్స్‌ నమోదు’ విధానంలో తమ ఆసుపత్రులు, వైద్యుల వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎనిమిది నెలల క్రితం నుంచే ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో ఆయుష్మాన్‌ భవ కింద నమోదు చేస్తున్నారు.

  • నమోదు చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రుల వారు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో చేరి వైద్యం పొందే వారి ఆరోగ్య సమాచారం ఆయుష్మాన్‌ భవ విభాగంలో నమోదు చేయాల్సి ఉంది.
  • కేంద్రం అందిస్తున్న రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా, ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.
  • అన్ని ప్రైవేటు ఆసుపత్రుల వారు తమకు సంబంధించిన వివరాలు ఆయుష్మాన్‌ భవ విభాగంలో నమోదు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కోటాచలం కోరారు. ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల వివరాలు సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమాచారం పంపారు. ప్రైవేటు ఆసుపత్రుల వారు నేరుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకోవాలని, లేని యెడల జిల్లా ఉపవైద్యాధికారి కార్యాలయంలో నిర్ణీత వివరాలతో వచ్చి నమోదు చేసుకోవాలని ఆదేశించారు.

  • నల్గొండ జిల్లాలో 159 ఆసుపత్రులు, 14 నర్సింగ్‌హోమ్‌లు, 49 డెలివరీ కేంద్రాలు, 111 స్కానింగ్‌ సెంటర్లు, 7 ఈఎన్‌టీ ఆసుపత్రులు, 24 కంటి వైద్యశాలలు, 18 చిన్నపిల్లల ఆసుపత్రులు, 51 దంత వైద్యశాలలు, 221 డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఇతర ఆసుపత్రులు కలిపి మొత్తం 611 ఉన్నాయి.
  • సూర్యాపేట జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, నర్సింగ్‌హోమ్‌లు, కంటి, దంత వైద్యశాలలు సుమారు 223 వరకు ఉన్నాయి.   బీ యాదాద్రి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, నేత్ర, దంత వైద్యశాలలు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు సుమారు 163 వరకు ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని