logo

అప్పుడు.. ఇప్పుడూ.. ప్రతిపక్షమే

గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు.

Updated : 08 Dec 2023 06:23 IST

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే, ఈనాడు డిజిటల్‌, సూర్యాపేట: గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఆ నేతలంతా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్నారు. అయితే తాము ఉన్న పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరారు. నాటి అధికార పక్షం.. ప్రస్తుతం ప్రతిపక్షంగా మారడంతో ఆ నేతలంతా మళ్లీ ప్రతిపక్షంలోనే ఉండిపోయారు. దీంతో వీరు నాడు.. నేడు ప్రతిపక్షంలోనే ఉండిపోయారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

రాష్ట్ర ఆవిర్భావం నుంచి..

తొలుత ప్రజారాజ్యం పార్టీ తరఫున మిర్యాలగూడ నుంచి బరిలో నిలిచిన అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి.. ఆ తర్వాత భారాసలో చేరారు. 2014లో భారాస నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు భారాసలో చేరడాన్ని వ్యతిరేకించిన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2018లో టికెట్‌ దక్కకపోవడంతో 2023 వరకు కాంగ్రెస్‌లో వేచి చూశారు. ఇప్పుడు కూడా టికెట్‌ దక్కకపోవడంతో తిరిగి భారాసలో చేరారు. అలా అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండిపోయారు.


పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి..

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నకిరేకల్‌ నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ చెరుకు సుధాకర్‌గౌడ్‌ నాటి భారాస అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకించి.. తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు. కొంత కాలం తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ఆయన.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ను వీడి భారాసలో చేరారు. ఎన్నికలో భారాస ఓటమి చవిచూడడంతో మళ్లీ ప్రతిపక్షంలోనే ఉండిపోయారు.


భాజపా నుంచి భారాస.. వయా కాంగ్రెస్‌

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఒకరు. ఆ తదనంతర పరిణామాలతో ఆయన కూడా యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. అయితే పార్టీని కొన్నేళ్లకు భాజపాలో విలీనం చేసిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌ గూటికి చేరారు. అక్కడ తనకు టికెట్‌ దక్కే అవకాశం లేకపోవడంతో ఎన్నికల ముందు భారాసలో చేరారు. దీంతో ఈయన సైతం మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు.


చివరి నిమిషంలో టికెట్‌ దక్కక..

మునుగోడు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ తనకే వస్తుందనుకున్న చలమల్ల కృష్ణారెడ్డి.. ఆ దిశగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే రాజగోపాల్‌రెడ్డి భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో కృష్ణారెడ్డికి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన భాజపాలో చేరి.. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో ఆయన మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని