logo

ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు

కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు.

Published : 08 Dec 2023 03:06 IST

కరాటే పోటీల్లో గెలుపొందిన వారితో డీఈవో భిక్షపతి, క్రీడా ఉపాధ్యాయులు

నీలగిరి, న్యూస్‌టుడే: కరాటే విద్య వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డీఈవో భిక్షపతి తెలిపారు. స్థానిక ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్‌ 14, 17 బాల బాలికల కరాటే పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారిని అభినందించారు. కరాటే శిక్షణ జీవితానికి ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో పాల్గొని విజేతలుగా నిలవాలని సూచించారు. రాష్ట్రం నుంచి జాతీయ పోటీలకు 45 మంది బాల బాలికలు ఎంపికయ్యారు. అండర్‌ 14 విభాగంలో బాలురు 10 మంది, బాలికలు 11 మంది,  అండర్‌ 17 విభాగంలో బాలికలు 11 మంది, బాలురు 13 మంది ఎంపికయ్యారు. కార్యక్రమంలో స్కూల్‌ గేమ్‌ కార్యదర్శి జి.వాసుదేవరావు, కరాటే అసోసియేషన్‌ కార్యదర్శి నరసింహాచారి, పవన్‌, విష్ణు, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్జీఎఫ్‌ క్రీడా పోటీలు ప్రారంభం

మిర్యాలగూడ పట్టణం, మిర్యాలగూడ గ్రామీణం: రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్‌(స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌) అండర్‌-14, 17 బాల, బాలికల ఫెన్సింగ్‌ క్రీడా పోటీలు మిర్యాలగూడ మండల పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో బీసీ బాలికల గురుకుల పాఠశాల(దామరచర్ల)లో గురువారం ప్రారంభమయ్యాయి. పోటీలను జిల్లా విద్యాధికారి భిక్షపతి, గురుకులాల ఆర్సీవో షకీనా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పోటీల నిర్వహణ కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం నాలుగు విభాగాల్లో 384 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఇక్కడి పోటీలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన విజేతలు ఈ నెల 16న మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొంటారన్నారు. క్రీడాకారులతో పాటు శిక్షకులు, మేనేజర్లు మరో 64 మంది హాజరయ్యారని.. 10 మంది మ్యాచ్‌ రెఫరీలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ నర్సింహారెడ్డి, రాష్ట్ర పరిశీలకులు హరికృష్ణ(అండర్‌-17), ప్రభాకర్‌(అండర్‌-14), ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, మాజీ కార్యదర్శి కుంభం నర్సిరెడ్డి పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని