logo

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంపై చిగురిస్తున్న ఆశలు

శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్‌ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Updated : 08 Dec 2023 06:22 IST

కాంగ్రెస్‌ హయాంలో మంజూరైనా.. నిధుల కటకటతో నిలిచిన పనులు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం ఔట్‌లెట్‌

ఈనాడు, నల్గొండ : శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్‌ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు పనులు ఈ ప్రభుత్వంలో పూర్తవుతాయన్న ఆశ ఉమ్మడి జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు పైగా తాగునీరు ఇచ్చే ఉద్దేశంతో 2007లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో రూ.1,925 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ 16 ఏళ్లలో సుమారు రూ.2500 కోట్ల వరకు ఖర్చుచేయగా.. పెరిగిన ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.4776 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టు కోసం అప్పట్లో పోరాటం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి తాజాగా మంత్రి పదవీ దక్కడంతో నిధుల సమస్యను ఆయన పరిష్కరిస్తారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన టన్నెల్‌ (సొరంగం) పనులు టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం)లో ఏర్పడిన సాంకేతిక లోపాలు, విద్యుత్తు ఛార్జీలు, కార్మికుల బకాయిలు తదితర సమస్యల వల్ల గత ఏప్రిల్‌ నుంచి నిలిచిపోయాయి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, జమ్ము, కశ్మీర్‌ రాష్ట్రాలకు చెందిన దాదాపు 300 మంది కార్మికులు సమ్మెకు దిగారు. దీనిని ఎంతకూ పరిష్కరించకపోవడంతో వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు. మొత్తం 42 కి.మీ.ల సొరంగ మార్గానికి గానూ ప్రస్తుతం 33.5 కి.మీ. మేర పనులు పూర్తి చేశారు. ఏప్రిల్‌లో టీబీఎంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో దానికి కావాల్సిన బేరింగ్‌లను జర్మనీ నుంచి తెప్పించాల్సి ఉండగా.. అధికార యంత్రాంగం, గుత్తేదారుల నిర్లక్ష్యంతో అది మరుగున పడింది. తాజాగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పదేళ్లలో రూ.500 కోట్ల మేర నిధులు

భారాస ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నిధుల కటకట వేధించింది. పదేళ్లలో కేవలం రూ.500 కోట్ల మేర మాత్రమే నిధులు విడుదల చేశారని కాంగ్రెస్‌ నాయకులు వెల్లడిస్తున్నారు. దీంతో ఈ నిధులు ఏ మూలకు సరిపోకపోవడంతో ప్రాజెక్టు పురోగతి ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి వెళ్లింది. ఏటా బడ్జెట్‌లోనూ నిధుల కేటాయింపు చేసినా అవి విడుదలకు నోచుకోకపోవడంతో కార్మికులకు, గుత్తేదారు కంపెనీకి నిరాశే మిగిలింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దీని కింద నిర్మాణం చేపట్టిన నక్కలగండి ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.   నక్కలగండిలో నిర్వాసితులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే ప్రాజెక్టులో నీటినిల్వ చేసుకోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.   సొరంగం పూర్తి చేసి నక్కలగండి ప్రాజెక్టును నింపితే దేవరకొండతో పాటూ మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలకు నీటి సమస్య తీరనుంది. ‘ ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి రివ్యూ చేస్తాం. తక్షణం ఎన్ని నిధులు అవసరం అవుతాయి..ప్రాజెక్టు పూర్తికి ఎంత మొత్తం అవసరం అవుతాయనే వివరాలతో పాటూ ప్రాజెక్టు పరిస్థితిపై ఓ నివేదిక తయారు చేస్తాం. అనంతరం దాన్ని ప్రభుత్వానికి అందజేస్తా’’మని సంబంధిత అధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని