logo

అపురూప ఘట్టం.. విధేయతకు పట్టం

అనుభవానికి, విధేయతకు కాంగ్రెస్‌ పార్టీ పట్టం కట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్‌ నేతలుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో స్థానం దక్కింది.

Published : 08 Dec 2023 03:10 IST

ఉత్తమ్‌, కోమటిరెడ్డిలకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు?
త్వరలోనే ఉమ్మడి జిల్లాకు మరో పదవి..!

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి

ఈనాడు, నల్గొండ : అనుభవానికి, విధేయతకు కాంగ్రెస్‌ పార్టీ పట్టం కట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్‌ నేతలుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో స్థానం దక్కింది. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు మంత్రివర్గంలో కీలకమైన శాఖ దక్కనుందని తెలిసింది. దిల్లీ స్థాయిలో పలుకుబడి ఉండటం, ముఖ్యమంత్రి పదవీకి పోటీ పడిన ఉత్తమ్‌కు అధిష్ఠానం కీలకమైన బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఆయనకు మంచి పదవి దక్కనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లా నుంచే మరో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కూడా  కీలకమైన శాఖ దక్కనుంది. ఆయన నల్గొండ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి భువనగిరి ఎంపీగా గెలుపొందారు. గతంలోనూ మంత్రిగా పనిచేశారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు మరో పదవి దక్కనుందని సమాచారం. త్వరలోనే తనకూ మంత్రిపదవీ దక్కుతుందన్న సమాచారం ఉందని, ఇందుకు పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ‘ఈనాడు’కు వెల్లడించారు. పార్టీ సీనియర్‌ నేత, సీఎల్పీ మాజీ నాయకుడు జానారెడ్డికి సైతం ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించనున్నారని సీనియర్‌ నేత ఒకరు ‘ఈనాడు’తో అభిప్రాయపడ్డారు. కేబినేట్‌ హోదాతో కూడిన పదవిని జానారెడ్డికి అప్పగించనున్నట్లు పార్టీ అగ్రనేత సోనియా, రాహుల్‌గాంధీలు హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

నామినేటెడ్‌ పదవులపై ఆశలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పదేళ్లుగా పదవులకు దూరంగా ఉండటంతో ఉమ్మడి జిల్లాలోని పార్టీ సీనియర్‌ నేతలు నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. సూర్యాపేట నుంచి టిక్కెట్‌ ఆశించి అధిష్ఠానం బుజ్జగింపులతో నామినేషన్‌ను ఉపసంహరించుకున్న పటేల్‌ రమేశ్‌రెడ్డి తనకు చట్టసభలో అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నారు. ఆలేరులో మాజీ ఎమ్మెల్యే నగేశ్‌ సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ లాంటి నేతలకు అవకాశం దక్కవచ్చన్న చర్చ సాగుతోంది. మరో నాలుగైదు నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు ఉండటంతో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి భువనగిరి పార్లమెంటు నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన సన్నిహితుడిగా ముద్రపడ్డారు. నల్గొండ పార్లమెంటు నుంచి సీనియర్‌ నేత జానారెడ్డి పోటీ చేస్తానని ప్రకటించినా.. మిర్యాలగూడ అసెంబ్లీ నుంచి టిక్కెట్‌ ఆశించిన ఆయన పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేస్తారన్న చర్చ సాగుతోంది. అనూహ్య పరిణామాలు ఏర్పడితే తప్ప ఈ రెండు పార్లమెంటు స్థానాల నుంచి వీరి పోటీ లాంఛనమేనని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. గత భారాస ప్రభుత్వంలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు భారీ స్థాయిలో కార్పొరేషన్‌ పదవులు దక్కాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏడు కార్పొరేషన్‌లకు ఉమ్మడి జిల్లా నాయకులే ఛైర్మన్‌లుగా ఉండేవారు. ఇప్పుడూ అదే స్థాయిలో పదవులు భర్తీ చేస్తారని కాంగ్రెస్‌ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక

నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఒకట్రెండు రోజుల్లో ఎమ్మెల్సీకి రాజీనామా చేయనున్నారని తెలిసింది. 2021 ఏప్రిల్‌లో జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌కుమార్‌)పై గెలుపొందారు.  ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్‌ మల్లన్న ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అందరి మన్ననలు పొంది

నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గృహనిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి అందరి మన్ననలు అందుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి మంత్రిగా  గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని గెలిచిన రోజే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’తో అన్నారు. అదే నిజమైంది.   1967లో హుజూర్‌నగర్‌ నుంచి గెలుపొందిన అక్కిరాజు వాసుదేవరావు మంత్రి అయ్యారు. అదే హుజూర్‌నగర్‌ నుంచి 2009లో గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2012లో గృహనిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తిరిగి హుజూర్‌నగర్‌ నుంచి గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు:

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రపతి భవన్‌లో ప్రొటోకాల్‌ అధికారిగా పనిచేసినప్పటి నుంచి జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నాయి. అందరితో  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసిపోతారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వివాదాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకుపోయారు. ఆయన సేవలు గుర్తించిన ఏఐసీసీ ఆయనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ జాతీయ పోరాటాల ప్రణాళిక కమిటీ సభ్యుడిగా నియమించారు. అనంతరం ఆయనను కేంద్ర ఎన్నికల ఎంపిక కమిటీ సభ్యుడిగా కూడా నియమించారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ఆయనను పలు ప్రాంతాలకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన సమయంలోనూ వాటిని సమర్థంగా నిర్వహించారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్రొటోకాల్‌ అధికారిగా పనిచేసినప్పుడు మదర్‌థెరిస్సాతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని