logo

TS News: తెలంగాణ అరకు.. ఐలాండ్‌ను తలపించే వైజాగ్‌కాలనీ

కొన్ని అద్భుత దృశ్యాలు చూడాలే గానీ  మాటలకు అందవు. వాటి మధ్య గడిపితే అలసట అన్పించదు.

Updated : 30 Mar 2024 07:37 IST

వైజాగ్‌కాలనీ

దేవరకొండ, న్యూస్‌టుడే: కొన్ని అద్భుత దృశ్యాలు చూడాలే గానీ  మాటలకు అందవు. వాటి మధ్య గడిపితే అలసట అన్పించదు. అలాంటిదే అందమైన కృష్ణాతీరాన్ని ఆవరించి ఉన్న దేవరకొండ నియోజకవర్గం. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణాపరివాహక ప్రాంతం.. నల్లమల అభయారణ్యంలో ఐదు జిల్లాలను విస్తరించిన కృష్ణపట్టి ఏరియా తీర ప్రాంతాన్ని చూసి ప్రకృతి ప్రేమికులు మంత్ర ముగ్ధులవుతున్నారు. దీంతో పాటు దేవరచర్ల ఆలయాన్ని పలువురు సందర్శిస్తున్నారు.

తెలంగాణ అరకుగా గుర్తింపు ఎప్పుడో..?

నల్లమల అభయరణ్యంలో సహజసిద్ధ ప్రకృతి అందాలతో అలరారుతూ నిత్యం జలాభిషేకంతో పూజలు అందుకుంటున్న శివన్న దర్శనానికి భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ జిల్లాల నుంచి దైవదర్శనానికి భక్తులు వస్తుండడంతో దేవరచర్ల కిటకిటలాడుతుంది. దేవరచర్ల గ్రామ శివారులో మునిస్వామి గుట్టపై క్రీస్తుశకం 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయకులు నిర్మించిన అతి పురాతన శివాలయం ఉంది. ఇంతటి ప్రాముఖ్యం గత పురాతన శివాలయాన్ని గతంలో సందర్శించిన దేవాదాయశాఖ అధికారులు తెలంగాణ అరకుగా  పేరు పెట్టారు. చందంపేట మండల కేంద్రం నుంచి తెల్దేవరపల్లికి వెళ్లే మార్గంలో ఈ దేవాలయం ఉంది.

ఐలాండ్‌ను తలపించే వైజాగ్‌కాలనీ

నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణపట్టి తీరాన్ని ఆవరించి ఉన్న వైజాగ్‌కాలనీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్‌కాలనీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. సాయంత్రం వేళ.. ఆకర్షణీయంగా ద్వీపకల్పంలా కనువిందు చేస్తున్నాయి. మూడు దిక్కుల నీరుండి మధ్యలో వైజాగ్‌కాలనీ గ్రామం ఉండడంతో ద్వీపకల్పాన్ని తలపిస్తుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని సందర్శకులు కోరుతున్నారు. నేరెడుగొమ్ము మండల పరిధిలో ఉండే వైజాగ్‌కాలనీ దేవరకొండ - డిండి ప్రధాన రహదారి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో చిన్నమునిగల్‌ దగ్గర ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని