logo

వినిపించనుంది.. రైలు కూత

కనగల్‌, చండూరు, నాంపల్లి మండల వాసులకు రైలు కూత వినిపించనుంది. ఇప్పటికే ఆయా మండలాల మీదుగా రైల్వే లైన్‌ ఏర్పాటుకు ప్రాథమిక సర్వే పూర్తిచేసిన యంత్రాంగం  మంగళవారం ప్రత్యేక ఎయిర్‌ క్రాప్ట్‌ ద్వారా శాటిలైట్‌ సర్వే నిర్వహించడంతో స్థానికుల ఆశలు చిగురిస్తున్నాయి.

Updated : 03 Apr 2024 06:26 IST

 మంచినీళ్లబావి గ్రామంలో ప్రతిపాదిత స్థలంలో ఏర్పాటు చేసిన డీజీపీఎస్‌

కనగల్‌, న్యూస్‌టుడే: కనగల్‌, చండూరు, నాంపల్లి మండల వాసులకు రైలు కూత వినిపించనుంది. ఇప్పటికే ఆయా మండలాల మీదుగా రైల్వే లైన్‌ ఏర్పాటుకు ప్రాథమిక సర్వే పూర్తిచేసిన యంత్రాంగం  మంగళవారం ప్రత్యేక ఎయిర్‌ క్రాప్ట్‌ ద్వారా శాటిలైట్‌ సర్వే నిర్వహించడంతో స్థానికుల ఆశలు చిగురిస్తున్నాయి. రైల్వే శాఖ ఓ ప్రైవేట్‌ కన్సల్టెన్సీ ఇంజినీరింగ్‌ విభాగం సిబ్బంది ద్వారా నల్గొండ మండలంలోని అన్నారెడ్డిగూడెం, కనగల్‌ మండల పరిధిలోని కేబీ తండా, మంచినీళ్లబావి, జి.చెన్నారం, ఏమిరెడ్డిగూడెం, పగిడిమర్రి, శాబ్దులాపురం, రేగట్టే, చండూరు మండలం ఉడతలపల్లి గ్రామాల మీదుగా రైలు మార్గం కోసం ఎయిర్‌ క్రాఫ్ట్‌ సర్వే నిర్వహించింది.అయితే    పది రోజుల క్రితమే ప్రైవేట్‌ కన్సల్టెన్సీ ఇంజినీరింగ్‌ సిబ్బంది ఆయా మార్గాల్లో మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో  మార్కింగ్‌ ఇచ్చి ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తి చేసింది. కనగల్‌ మండలంలోని మంచినీళ్లబావి, జి.చెన్నారం, పగిడిమర్రి, రేగట్టే వద్ద మార్కింగ్‌ వేశారు.

డోర్నకల్‌ నుంచి కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, తిప్పర్తి, నల్గొండ, కనగల్‌, చండూరు, నాంపల్లి మీదుగా.. గద్వాల వరకు రైల్వే లైను ప్రాథమిక సర్వే పూర్తి అయింది.  సిబ్బంది సర్వే చేస్తుండటంతో స్థానికులు ఒక లైనా.. రెండులైన్లా అంటూ ఇంజినీరింగ్‌ సిబ్బందిని ఆరా తీస్తున్నారు. శాటిలైట్‌ ద్వారా.. ఇప్పటికే ప్రాథమికంగా సర్వే నిర్వహించిన ప్రైవేట్‌ కన్సల్టెన్సీ మంగళవారం శాటిలైట్‌ ఆధారిత డిపరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌), ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌ అనే రెండు పద్ధతులను ఉపయోగించి కచ్చితమైన కో ఆర్డినేట్‌లను తెలుసుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ల సాయంతో సర్వే నిర్వహించింది.  25 కిలోమీటర్లకు ఒక డీజీపీఎస్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక ఎయిర్‌ క్రాఫ్ట్‌ ద్వారా మంగళవారం ఏడు సెంటర్లలో విజయవాడ నుంచి సూర్యాపేట, భీమారం, మోతె, తిప్పర్తి, నల్గొండ, కనగల్‌, చండూరు శివారు వరకు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఎయిర్‌ క్రాఫ్ట్‌ అత్యంత కింది నుంచి ప్రయాణించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అన్ని సవ్యంగా జరిగితే ఈ ప్రాంత ప్రజలకు రైలు కూత వినిపించనుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని