logo

తప్పుడు పోస్టులకు తప్పదు మూల్యం.. తెలియదంటే కుదరదు..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల క్రతువు దగ్గర పడుతుండటంతో వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో అభ్యర్థులు, పార్టీల అభిమానులు చురుగ్గా ఉంటున్నారు.

Updated : 13 Apr 2024 07:23 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల క్రతువు దగ్గర పడుతుండటంతో వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో అభ్యర్థులు, పార్టీల అభిమానులు చురుగ్గా ఉంటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సైబర్‌ క్రైం విభాగం సామాజిక మాధ్యమాల్లో జరిగే కార్యకలాపాలపై నిఘా పెట్టి చట్ట వ్యతిరేక అంశాలను గుర్తించి సుమోటాగా కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

  • సామాజిక మాధ్యమాల్లో గ్రూపు అడ్మిన్‌ పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా తప్పుడు ప్రచారం జరిగితే తనకు తెలియదంటే కుదరదు.
  • వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ప్రతి పోస్టింగ్‌కు అడ్మిన్‌ బాధ్యత తీసుకోవడంతో పాటు గ్రూపులో ప్రతి సభ్యుడి పేరు, చిరునామా తెలిసి ఉండాలి.
  • సభ్యులను గ్రూపులో చేర్చుకునే ముందు వారి అనుమతి తీసుకోవాలి.
  • నిబంధనలకు విరుద్ధంగా గ్రూపులో పోస్టులు పెట్టే సభ్యులను తొలగించి స్థానిక పోలీసులకు తెలియజేయాలి.
  • అడ్మినే వివాదాస్పద, అభ్యంతరకర, వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టింగులు పెడితే ఐటీ చట్టం ఐపీసీ సెక్షన్‌ 153(ఎ) కింద కేసు నమోదు చేస్తారు. 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
  • అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించారు. వారు పెట్టిన పోస్టు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
  • నిబంధనలు పాటించకుండా వ్యవహరించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
  • ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద చరవాణి ఉంది. సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి పోస్టులు పెడితే తిప్పలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పార్టీలు, అభ్యర్థుల గొప్పతనం చెప్పుకునే క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా వాగ్వాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థులను కించపరిచేలా, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టేలా వాయిస్‌ మెసేజ్‌లు, ఫొటోల మార్ఫింగ్‌, వాస్తవ విరుద్ధంగా అభ్యంతరకర పోస్టులు పెట్టినా, వారికి మద్దతిస్తూ కామెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తారు. సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే తాయిలాల పంపిణీపై నిఘా ఉంచారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఐటీ చట్టం, ఐపీసీలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద చరవాణి ఉంది. సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి పోస్టులు పెడితే తిప్పలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పార్టీలు, అభ్యర్థుల గొప్పతనం చెప్పుకునే క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా వాగ్వాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థులను కించపరిచేలా, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టేలా వాయిస్‌ మెసేజ్‌లు, ఫొటోల మార్ఫింగ్‌, వాస్తవ విరుద్ధంగా అభ్యంతరకర పోస్టులు పెట్టినా, వారికి మద్దతిస్తూ కామెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తారు. సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే తాయిలాల పంపిణీపై నిఘా ఉంచారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఐటీ చట్టం, ఐపీసీలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలొచ్చినప్పుడల్లా ఎక్కువ శాతం గతంలో పోటీ చేసిన వారే బరిలో కన్పిస్తుంటారు. కాకపోతే కొందరు పార్టీలు మారి కన్పిస్తారు. మరికొందరు అసెంబ్లీ నుంచి లోక్‌సభ, లోక్‌సభ నుంచి అసెంబ్లీకి వెళ్లాలన్న లక్ష్యంతో పోటీ చేస్తుంటారు. ఈసారి నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి పరిస్థితులే కన్పించాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గ భారాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌) గెలుపొందారు. తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఉత్తమ్‌ విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మళ్లీ 2019లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఉత్తమ్‌ సతీమణి (కాంగ్రెస్‌)పై భారాస అభ్యర్థి సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా నిలబడిన సైదిరెడ్డిపై మళ్లీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌) గెలుపొందారు. ఓటమి పాలైన సైదిరెడ్డి ఇటీవలే భాజపాలో చేరారు. ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతుండగా, ఈసారి భాజపా నల్గొండ లోక్‌సభ అభ్యర్థిగా సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. నిన్న ఎంపీ స్థాయిలో ఉండి అసెంబ్లీ స్థానం వైపు ఉత్తమ్‌ ఆసక్తి చూపగా, ఎమ్మెల్యేగా ఓటమిపాలై నేడు ఎంపీ స్థానానికి సైదిరెడ్డి పోటీ పడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని