logo

పునాది దాటనివిజ్ఞాన కేంద్రం

ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, సంగం, చేజర్ల, ఆత్మకూరు మండలాల్లో 27 గ్రంథాలయాలు మంజూరవగా కొన్నిచోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి.

Updated : 13 Apr 2024 06:01 IST

నిధుల విడుదలలో జాప్యం ప్రభుత్వం నిర్లక్ష్యం

పొంగూరు కండ్రికలో అసంపూర్తిగా డిజిటల్‌ గ్రంథాలయ భవనం

ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, సంగం, చేజర్ల, ఆత్మకూరు మండలాల్లో 27 గ్రంథాలయాలు మంజూరవగా కొన్నిచోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి. ఇవి అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. అధికశాతం భవనాలకు పునాదులు కూడా పడలేదు.

మర్రిపాడు (ఆత్మకూరు గ్రామీణం), న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో డిజిటల్‌ గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటికి పక్కా భవనాల నిర్మాణానికి వీలుగా ఉపాధి నిధులు మంజూరు చేశారు. ఒక్కో భవన నానికి రూ.16 లక్షలు కేటాయించింది. వీటిని మంజూరు చేసి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు పనుల్లో పురోగతి కనిపించడంలేదు. చాలా చోట్ల పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఇప్పటికే సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్‌నెస్‌ కేంద్రాలు నిర్మించి చేతి చమురు వదిలించుకున్నామని, ఇక తమ వల్ల కాదని గుత్తేదారులు చేతులెత్తేశారు. దీంతో ఇవి ఎప్పటికి పూర్తి అవుతాయన్నది సందిగ్ధంగా మారింది.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవసరమైన అధ్యయన సామగ్రిని అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా పూర్తి సాంకేతికతను జోడించి డిజిటల్‌ గ్రంథాయాలు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఉద్దేశం మంచిదే అయినా నిధుల విడుదలలో జాప్యంవల్ల లక్ష్యం నెరవేరటంలేదు. పట్టణాలు, మండల కేంద్రాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు లేవు. పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే నిరుద్యోగులు శిక్షణ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి.

డిజిటల్‌ గ్రంథాలయంలో ఇంటర్నెట్ సదుపాయంతోపాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, బల్లలు, కుర్చీలు, ఇనుప అరలు, విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లు, పుస్తకాలు ఉంచేందుకు అనువుగా భవనం నిర్మించాలి. 50 నుంచి 60 మంది కూర్చునేలా వసతులు కల్పించాలి. భవన నిర్మాణాల్లో పురోగతి కనిపించకపోవడానికి ప్రధానంగా వ్యయం పెరగడమే కారణమని తెలుస్తోంది. అన్ని హంగులతో భవనం నిర్మించాలంటే రూ.16 లక్షలు ఏమాత్రం సరిపోదని, దీనికితోడు సకాలంలో బిల్లులు రావనే అభిప్రాయంతో గుత్తేదారులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ప్రభుత్వం భవనాలు నిర్మించేందుకు అనుమతులిచ్చిందే తప్ప.. భరోసా కల్పించకపోవడంతోనే నిర్మాణాలు ముందుకు సాగడంలేదని పలువురు పేర్కొంటున్నారు. వీటి నిర్మాణాల్లో ప్రభుత్వం జాప్యం చేస్తూ తమతో ఆడుకుంటోందని నిరుద్యోగి సురేష్‌ ఆవేదన చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని