logo

ప్రభుత్వ భూములు దర్జాగా కబ్జా

వింజమూరు మండలంలో అధికార వైకాపా నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మకై కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు.

Published : 13 Apr 2024 03:05 IST

న్యూస్‌టుడే, వింజమూరు

ఆక్రమణలు పరిశీలిస్తున్న కావలి ఆర్డీవో శీనానాయక్‌

వింజమూరు మండలంలో అధికార వైకాపా నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మకై కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. మండల కేంద్రం చుట్టుపక్కల సుమారు 5 కి.మీ. పరిధిలో ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి దాదాపు వంద కోట్లకు పైగా దోచుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆక్రమణలున్న ప్రాంతాలను కావలి ఆర్డీవో శీనానాయక్‌ సిబ్బందితో కలసి గతంలో పరిశీలించారు. సర్వే చేసి వాటిని గుర్తించి నివేదిక తయారు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించిన వాటిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటి వరకు ఆ విషయమై సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటిస్తున్నారే తప్ప ఆచరణలో కనిపించడం లేదు.

  •  మండలంలోని కాటేపల్లి, తక్కెళ్లపాడు, బత్తినవారిపల్లి, గుండెమడకల తదితర గ్రామాల్లో నేటికీ ప్రభుత్వ భూముల ఆక్రమణలున్నాయి. కాటేపల్లిలో సుమారు 1,277 ఎకరాల భూమి బడా రైతుల చెరలో ఉంది. ఈ భూమిపై 145 సెక్షన్‌ ఉన్నా ఇంత వరకు చర్యలు లేవు. ప్రభుత్వ భూముల్లో బోర్లు వేసి విద్యుత్తు కనెక్షన్లు కూడా తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు.
  •   వింజమూరు చుట్టుపక్కల 5 కి.మీ.ల పరిధిలోని ప్రభుత్వ భూములపై సర్వేయర్‌, వీఆర్వోల ద్వారా సర్వే చేయించి నివేదిక తయారు చేయాలన్న ఆర్డీవో ఆదేశాలు అమలు కాలేదు. ఈ ప్లాట్లు చేతులు మారాయి. కావలి- ఉదయగిరి రోడ్డులో మల్లపరాజువాగు ఆనుకుని ఉన్న భూమిలో వేసిన లేఅవుట్‌లో ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు పలువురి చేతులు మారాయి. అత్యంత విలువైన ఈ ప్లాట్లు అప్పట్లో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది కనుసన్నల్లో వారి అనుయాయులకు కేటాయించారనే విమర్శలున్నాయి. ఆయా ప్లాట్లలో జరిగిన భారీ నిర్మాణాలను కూడా అధికారుల బృందం పరిశీలించింది. కొన్నిచోట్ల కొందరు ఆక్రమించి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అలాంటి వారిపై కౌంటర్‌ వేయించి వాటిని వెకేట్‌ చేయించి ఆ భూములను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించి ఉన్నారు.

 చర్యలు తీసుకుంటాం ఎంవీ కృష్ణారెడ్డి, తహసీల్దారు

ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయం నా దృష్టికి వచ్చింది. నోటీసులు అందుకున్న వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టపరంగా ముందుకు వెళుతున్నాం. భూములు పరాధీనం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నా. కాటేపల్లి తదితర గ్రామాల్లో ఆక్రమణల విషయం నా దృష్టికి రాలేదు. ఆక్రమణలో ఉన్న భూముల వివరాలు తెలుసుకుని ప్రభుత్వ స్వాధీనానికి చర్యలు తీసుకుంటా.

 అసైన్డ్‌ భూముల్లో లే అవుట్ల అక్రమాలపై అధికారులు ఇటీవల కొందరికి నోటీసులు ఇచ్చారు. ఇవి తీసుకున్న వారిలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు విచారించి లేఅవుట్లు వేసిన కొన్ని అసైన్డ్‌ భూములు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నోటీసుల్లో 27.75 ఎకరాల భూమిని పేర్కొన్నారు. 129-1, 129-3, 130-1, 131-1, 132-3, 132-4, 132-6, 132-7, 133-2, 133-4, 127-1, 127-2 సర్వే నంబర్లలో సుమారు 40 ఎకరాల్లో లేఅవుట్లు వేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు