logo

కళ్లముందే దోపిడీ.. కనిపించలేదెవరికీ?

అధికారమే అండగా వైకాపా నాయకులు ప్రభుత్వ, అటవీ భూములు అన్న తేడా లేకుండా ఖనిజ సంపదను కొల్లగొట్టారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి ఇష్టారాజ్యంగా దోచుకున్నారు.

Published : 13 Apr 2024 03:08 IST

పర్యావరణ సమస్యలపై హైకోర్టు ఆదేశాలతో ఉమ్మడి సర్వే

సర్వే నిర్వహిస్తున్న మైనింగ్‌, రెవెన్యూ అధికారులు

 న్యూస్‌టుడే, సైదాపురం : అధికారమే అండగా వైకాపా నాయకులు ప్రభుత్వ, అటవీ భూములు అన్న తేడా లేకుండా ఖనిజ సంపదను కొల్లగొట్టారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహించగా- అదే అదనుగా ఏకంగా పురాతన పుణ్యక్షేత్రం సిద్ధేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో మైనింగ్‌ లీజులు పొంది తవ్వకాలు సాగిస్తున్నారు. ఆ క్రమంలో జరిగే అనర్థాలనూ గాలికి వదిలేశారు. దాంతో కొందరు స్థానికులు సిద్దలకొండ ప్రాంతంలో పర్యావరణం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొందని హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు శుక్రవారం మైనింగ్‌, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే నిర్వహించారు.

లీజుల పేరుతో...సిద్ధలకొండ క్షేత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో మైకా గనుల నిర్వహణకు అనుమతులు ఇవ్వగా- కొందరు గనుల యజమానులు క్షేత్రానికి సంబంధించిన ప్రాంతంలోకి వచ్చి మైనింగ్‌ చేస్తున్నారంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం.. లీజులు పొందిన వారు ఆలయ ప్రాంతానికి రెండు వందల మీటర్ల దూరంలో మైనింగ్‌ చేయాలని గతంలో ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేదని, న్యాయస్థానం ఉత్తర్వులు ధిక్కరించారని బదరీనాథ్‌ అనే వ్యక్తి తిరిగి హైకోర్టును ఆశ్రయించగా.. సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఇప్పటికే నష్టం.. ఆలయానికి సమీపంలో ఖనిజాన్ని వేరుచేసే యంత్రాలను ఏర్పాటు చేయడంతో.. కొండ కింద ఉన్న దక్షిణామూర్తి ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిలిచిపోయాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్‌ లీజులకు అనుమతి ఇచ్చేముందు.. వందేళ్ల చరిత్ర గల సిద్ధలకొండ క్షేత్రం ఉందన్న విషయం ఎలా విస్మరించారని మండిపడుతున్నారు. క్షేత్రాన్ని పరిరక్షించాలనే తమ నివేదనను అధికారులు ఆలకించకపోవడంతోనే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెబుతున్నారు.

 పర్యావరణానికి పాతర

చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు, చట్టుబండే ఆలయంగా నిలిచి తపస్సిద్దులుగా వెలిసిన క్షేత్రం సిద్ధలకొండ. ఏటా కార్తీకమాసంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. నెల రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి చోట మైనింగ్‌ చేస్తే.. పర్యావరణానికి విఘాతం కలగడంతో పాటు చారిత్రక క్షేత్రం ఉనికికే ప్రమాదమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండకు పరిసర ప్రాంతంలో ఎలాంటి మైనింగ్‌ లీజులు మంజూరు చేయొద్దని రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు విన్నవించుకున్నా.. తమది అరణ్య రోదనే అయిందని ఆలయ కమిటీ సభ్యులు వాపోతున్నారు.

కమిటీ సభ్యుల ఆవేదన

సర్వే సందర్భంగా అభ్యంతరాలను పరిశీలించేందుకు వచ్చిన గనులశాఖ అధికారి... ఆలయ కమిటీ సభ్యులను సర్వే ప్రాంతానికి అనుమతించలేదు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కేసు వేసిన వాది, ప్రతివాదులు మాత్రమే ఉండాలని చెప్పారు. దాంతో తమ గోడు అధికారులకు విన్నవించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆలయ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి క్షేత్రాన్ని పరిరక్షించాలని కోరారు. ఉమ్మడి సర్వేలో జిల్లా గనుల శాఖ డీడీ శ్రీనివాసకుమార్‌, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని