logo

గడువు లేదు.. ఓటరూ మేలుకో..

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. పాలకులను ఎన్నుకునే తరుణం ఆసన్నమైంది. మనం వేసే ఒక్క ఓటు గెలుపోటములను నిర్ణయిస్తుంది.

Published : 13 Apr 2024 03:19 IST

ఓటు హక్కు నమోదుకు రెండు రోజులే

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. పాలకులను ఎన్నుకునే తరుణం ఆసన్నమైంది. మనం వేసే ఒక్క ఓటు గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో సరిచూసుకోవాలి. లేకుంటే వెంటనే ఓటు నమోదు దరఖాస్తు (ఫారం-6) చేసుకోవాలి. ఈనెల 14వ తేదీ వరకే  గడువు ఉండటంతో అర్హులంతా మేలుకోవాలి. లేకుంటే ఓటేసే పరిస్థితి ఉండదు. ఉత్తమ నాయకులను ఎన్నుకునే అవకాశం కోల్పోతారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 8 అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటరు జాబితాలో పేరు ఉండాలి. లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 14వ తేదీ రాత్రి వరకు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. యువత అత్యంత కీలకం. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. అందిన దరఖాస్తులు విచారించి ఓటు హక్కు కల్పిస్తారు.

యువ ఓటర్లే కీలకం

జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారు నమోదు చేసుకోవాలి. ఇటీవల విడుదలైన జాబితాను పరిశీలిస్తే జిల్లాలో 18-19 వయసు ఓటర్లు 36,175 మంది ఉన్నట్లు తేలింది. 40-49 ఏళ్ల వారు అత్యధికంగా 4,29,668 మంది ఉన్నారు. యువతతో పాటు ఓటు హక్కు లేని ఇతర వయసుల వారు కూడా దరఖాస్తు చేసుకుని రానున్న ఎన్నికల్లో పాల్గొనాలని యంత్రాంగం కోరుతోంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం..

ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు నాలుగు విధానాలు ఉన్నాయి. వెబ్‌సైట్‌లో మీ చరవాణి నంబరుతో రిజిస్టర్‌ చేసుకుని లాగిన్‌ కావాలి.

  • www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తొలుత మీ ఫోను నంబరుతో రిజిస్టర్‌ చేసుకుని లాగిన్‌ కావాలి.
  • https://voters. eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తొలుత మీ ఫోను నంబరుతో రిజిస్టర్‌ చేసుకోవాలి. లాగిన్‌ అయి వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన వెంటనే ‘న్యూ ఓటర్‌ రిజిస్ట్రేషన్‌’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసుకుంటూ వెళ్లి దరఖాస్తుతో అడిగిన వివరాలన్నీ నింపి సబ్‌మిట్‌ చేయవచ్చు.
  • ప్లేస్టోర్‌లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన voterhelpline మొబైల్‌ యాప్‌ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని మీఫోను నంబరు వివరాలు పొందుపర్చి రిజిస్టర్‌ చేసుకోవాలి. వాటి ఆధారంగా లాగిన్‌ కావాలి.
  • https:// ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో సైతం ఎన్‌వీఎస్‌పీ ఓటర్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌ లింకుల్లోకి వెళ్లి హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎల్‌వోల పరిశీలన తర్వాత కార్డు వస్తుంది.

నేరుగానూ ఇవ్వొచ్చు

ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు. నేరుగా బూత్‌ స్థాయి అధికారులకు (బీఎల్వోలకు) అందజేయాలి. ఫారం-6 దరఖాస్తు సమర్పించి హక్కు కోరవచ్చు. ప్రతి నియోజకవర్గానికి డివిజన్‌ స్థాయి అధికారిని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్వో)గా ఎన్నికల సంఘం నియమించింది. వారి కార్యాలయాల్లోనూ దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ప్రతి మండలంలోనూ తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దారును అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఏఈఆర్వోలు)గా నియమించింది. వారి కార్యాలయాలనూ సంప్రదించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు