logo

ధరల దడ.. అయిదేళ్లలో ఎడాపెడా!

నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ తల్లకిందులవుతోంది. ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉసూరుమంటున్నారు

Updated : 13 Apr 2024 05:52 IST

ఆకాశాన్నంటిన బియ్యం, పప్పుల ధరలు
అదనపు మోతతో సామాన్య కుటుంబాలు విలవిల
రేషన్‌ దుకాణాల్లోనూ కోత పెట్టిన జగన్‌ సర్కార్‌


నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ తల్లకిందులవుతోంది. ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉసూరుమంటున్నారు. రోజు రోజుకూ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టు అవుతున్నా.. ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.

ఈనాడు, నెల్లూరు: వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తే.. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పప్పులు, బియ్యం.. ఇలా ప్రతీది సామాన్యులకు భారంగా మారాయి. అయిదేళ్లతో పోల్చితే.. సగటున 30 నుంచి 50శాతం వరకు, బియ్యం 32, కందిపప్పు 107 శాతం పెరిగాయి. వీటికి తోడు విద్యుత్తు బిల్లులు, వంట గ్యాస్‌, పాలు ఇతరత్రా బాదుడుతో ఇంటి ఖర్చులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయిదేళ్ల కిందటితో పోల్చితే.. బియ్యం, ఉప్పు, పప్పులు తదితర సరకుల రూపంలోనే నెలకు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు అదనంగా ఖర్చవుతోందని మధ్యతరగతి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం రేషన్‌ దుకాణాల్లో ఇచ్చే సరకులను సక్రమంగా ఇవ్వకుండా  వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బియ్యం భారం.. ఏడాదికి రూ. 3వేలు

బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2022 సెప్టెంబరు నుంచి మొదలైన పెరుగుదల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కిలో సన్నబియ్యం రూ. 50 వరకు ఉండగా.. ఇప్పుడు సగటున రూ. 60 దాటింది. కొన్ని రకాల సాధారణ బియ్యమే రూ.50కిపైగా విక్రయిస్తున్నారు. దీంతో నెలకు 25 కిలోలు వినియోగించే కుటుంబంపై రూ. 250 భారం పడుతోంది. అంటే ఏడాదికి రూ. 3వేల చొప్పున వంటింటి ఖర్చు పెరిగింది. గోధుమపిండి సైతం కిలో రూ. 45 నుంచి రూ. 55కు ఎగబాకింది.

వైకాపా పప్పులే ఉడికాయ్‌..

2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేసిన జగన్‌.. రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిస్థితి మార్చేస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి తెదేపా హయాంలో పౌరసరఫరాల దుకాణాల్లో రూ. 80కే రెండు కిలోల(కేజీ రూ.40 చొప్పున) కందిపప్పు ఇస్తే.. జగన్‌ సీఎం అయ్యాక కిలోకు రూ.27 పెంచి, రూ.67 చొప్పున పంపిణీ చేశారు. పైగా గత ఏడాది నుంచి క్రమంగా దాన్ని తగ్గిస్తూ వచ్చారు. జిల్లాలో మొత్తం 7,32,331 రేషన్‌కార్డులకు ప్రతి నెలా 11,132.965 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 386.613 మెట్రిక్‌ టన్నుల చక్కెర, 732.331 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అందించాల్సి ఉంది. ఏడాదిగా కందిపప్పు, చక్కెర సరిగా అందించడం లేదు. దీంతో ఆ భారం ప్రజలపై పడుతోంది. కందిపప్పు ధరలు గత ఏడాదిలో రూ.80కిపైగా పెరిగింది. ప్రస్తుతం కిలో రూ. 180 నుంచి రూ. 190 మధ్య కొనసాగుతోంది. సగటున కుటుంబానికి నెలకు కిలో వినియోగం చొప్పున చూసినా.. ఏడాదికి రూ. 1200 భారం పడుతోంది. మినపగుళ్ల ధరలు కూడా కిలో రూ.130కిపైగా ఉంది. పల్లీలు(వేరుసెనగ గుళ్లు) కిలో రూ. 160 నుంచి రూ.180కిపైగా పలుకుతున్నాయి. వేరుసెనగ నూనె లీటరు రూ. 170పైనే ఉంది.


ఉప్పు కూడా పెరిగింది

గత కొన్ని రోజులుగా పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. బియ్యం గతంలో రూ. వేయికి మంచివి వచ్చేవి. ఇప్పుడు రూ. 1350పైన ఖర్చు చేయాల్సి వస్తోంది. గతంలో ఉల్లి, టమోట ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రైతు బజారులో స్టాల్స్‌ పెట్టి, ఆధార్‌కార్డు చూసి తక్కువ ధరకు ఇచ్చారు. మిగిలిన వాటిని పట్టించుకోలేదు. బాగా ఇబ్బందిగా ఉంటోంది. చివరకు ఉప్పు కూడా రూ.8 నుంచి రూ.20 వరకు పెరిగింది.  

- సామాన్యుడు, నెల్లూరు


ప్రభుత్వమే కదా పట్టించుకోవాలి

సాధారణంగా నిత్యావసరాల ధరలను ప్రభుత్వమే నియంత్రించాలి. గత అయిదేళ్లలో ధరలు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగులకు భారమే అయినా.. నెట్టుకొస్తారు. రోజువారీ కూలీలు, మధ్యతరగతి ప్రజల పరిస్థితి దారుణం. నెలకు రూ. 10వేలు తెచ్చుకునే ఉద్యోగి ఇంటి అద్దె కట్టాలా? పిల్లల చదువు చూడాలా? సతమతమవుతున్నారు. 

 గృహిణి, నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని