logo

జగన్‌.. ఇదీ మీ ఏలు‘బడి’

కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ బడులను తయారు చేశామని.. ప్రతి పాఠశాలకూ అందమైన భవనాలు, ఫర్నిచర్‌, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు మరుగుదొడ్లు సమకూర్చామని పదేపదే వైకాపా ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. మొదటి విడతలో.. ఏడేళ్లపాటు ఉంటాయని వేసిన రంగలు ఏడాదికే వెలిసిపోగా- మరమ్మతులు చేసిన పాఠశాలల్లో రెండేళ్లు గడవక ముందే సమస్యలు పునరావృతమయ్యాయి.

Published : 13 Apr 2024 05:41 IST

దశ, దిశ మార్చామని ప్రగల్భాలు
అసంపూర్తి పనులతో అంతటా అవస్థలు

కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ బడులను తయారు చేశామని.. ప్రతి పాఠశాలకూ అందమైన భవనాలు, ఫర్నిచర్‌, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు మరుగుదొడ్లు సమకూర్చామని పదేపదే వైకాపా ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. మొదటి విడతలో.. ఏడేళ్లపాటు ఉంటాయని వేసిన రంగలు ఏడాదికే వెలిసిపోగా- మరమ్మతులు చేసిన పాఠశాలల్లో రెండేళ్లు గడవక ముందే సమస్యలు పునరావృతమయ్యాయి. ఆర్వోప్లాంట్లు పడకేశాయి. మరుగుదొడ్ల తలుపులు ఊడిపోయినా పట్టించుకునేవారు లేరు. ఆ తర్వాత రెండో విడత పనులు.. ముందుకు సాగడం లేదు. అన్నిచోట్లా మొండిగోడలే దర్శనమిస్తుండగా- మరోవైపు పాఠశాల ప్రాంగణాలు నిర్మాణ సామగ్రితో.. విద్యార్థులు భయంభయంగా చదువుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల దిశ, దశ మార్చేస్తానని చెప్పి.. అయిదేళ్లలో రెండో విడతే పూర్తి చేయలేదు.

ఈనాడు, నెల్లూరు: విద్య, న్యూస్‌టుడే

 జిల్లాలో నాడు-నేడు మొదటి విడతలో 1060 పాఠశాలల్లో పనులు చేశారు. ఒక్కో పాఠశాలకు రూ. పది లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఖర్చు చేసి అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు తదితర తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించారు. అందుకోసం రూ. 232 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడతలో మొత్తం 1356 పాఠశాలల్లో 8,464 పనులు చేయాలని గుర్తించారు. వాటికి రూ. 453 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. వాటిలో ప్రహరీలు 335, మరుగుదొడ్లు 1008, 552 బడుల్లో అదనపు తరగతి గదులు, 904 చోట్ల విద్యుత్తు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. వీటిలో సగం కూడా పూర్తికాకముందే మొదటి విడత పనుల నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. తల్లిదండ్రుల కమిటీ ముసుగులో చాలాచోట్ల వైకాపా నాయకులే పనులు చేశారు. మొదటి విడత పనులు పూర్తి చేసి.. రెండేళ్లు గడవక ముందే.. చాలా బడుల్లో టైల్స్‌తో వేసిన ఫ్లోరింగ్‌ కుంగిపోయింది. వేసిన రంగులు వెలిసిపోయాయి. నీటిశుద్ధి కేంద్రాలు మూతపడ్డాయి. మరమ్మతులు చేసిన శ్లాబ్‌ పెచ్చులు ఊడిపోతున్నాయి. పచ్చదనం కనుమరుగైంది. గదులు పూర్తికాకపోవడంతో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో విద్యను అభ్యసించాల్సి వస్తోంది.

నిధులు లేక నిలిచిన భవనాలు

మొదట్లో ప్రతిపాదించిన అదనపు గదులను ప్రభుత్వం తగ్గించింది. వాటిని పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. దాదాపు ఏడాదిగా నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 329 బడుల్లో 982 గదులు నిర్మించాలని నిర్ణయించినా.. పూర్తిస్థాయిలో పూర్తయినవి వేళ్లమీదనే లెక్క పెట్టొచ్చు. 335 చోట్ల ప్రహరీలు నిర్మించాలని ప్రతిపాదించగా.. 35 చోట్లనే పూర్తి చేశారు. 194 పాఠశాలలకు గేట్లు బిగించాల్సి ఉంది. ఆలస్యానికి ప్రధాన కారణం.. ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడమేనని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. రెండో విడతలో మొత్తం పనుల విలువ రూ. 453 కోట్లుగా అంచనా వేయగా.. ఇప్పటి వరకు రూ. 182.82 కోట్లు అందించారు. ఇందులో రూ. 160.12 కోట్లు ఖర్చు చేయగా.. ఇంకా రూ. 30 కోట్లు మిగిలి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గుత్తేదారులకు బిల్లులు సక్రమంగా పడకపోవడంతో.. పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. దాదాపు ఆరు నెలలుగా ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర  ఇబ్బంది పడుతున్నారు.

ప్రమాదక పరిస్థితుల్లో..

నెల్లూరు మూలాపేటలోని ఈఎస్‌ఆర్‌ఎం పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 349 మంది చదువుతుండగా- రెండో విడతలో 9 అదనపు గదుల నిర్మాణానికి రూ. 1.07 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత అన్ని అవసరం లేదని మూడు మాత్రమే నిర్మించాలని సూచించారు. దానికి రూ. 55 లక్షలు మంజూరు చేశారు. అప్పటికే ఆరు గదులు ప్రారంభించగా.. ప్రస్తుతం అవన్నీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. దీంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అసంపూర్తి గదుల్లోనే..

అల్లూరు: తూర్పు గోగులపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టిన నిర్మాణాలు సిమెంట్‌ సరఫరా కాని కారణంగా మూడు నెలలుగా ఆగిపోయాయి. తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయలేదు. విద్యార్థులు అసంపూర్తి గదుల్లోనే కూర్చుంటున్నారు. వేడి గాలుల తీవ్రతకు చిన్నారులు అల్లాడిపోతున్నారు.

చెట్ల కిందే చదువులు

నెల్లూరు కేఎన్‌ఆర్‌ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు సుమారు 1600 మంది చదువుతుండగా- నాడు-నేడు రెండో విడతలో 20 తరగతి గదులు నిర్మించేందుకు రూ. 2.20 కోట్లు మంజూరు చేశారు. వాటిలో ఇప్పటి వరకు 12 గదుల నిర్మాణం ప్రారంభం కాగా.. 8 దాదాపుగా పూర్తయ్యాయి. ఫినిషింగ్‌ పనులు కాలేదు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పనులు జరుగుతున్న చోటే..

నెల్లూరు నగరంలోని రామయ్య బడిలో గత ఏడాది నాడు- నేడు పథకం కింద పనులు చేపట్టారు. ఏడాది కాలమైనా పనులు పూర్తికాలేదు. పనులు జరుగుతున్న గదుల చెంతనే విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఒక్కటీ పూర్తి కాలేదు

మర్రిపాడు: చిలకపాడు ఉన్నత పాఠశాలలో 110 మంది చదువుతుండగా- ప్రస్తుతం ఉన్న 9 గదుల్లో 4 శిథిలావస్థకు చేరాయి. మిగిలిన వాటిలో ఒకటి కార్యాలయానికి ఉపయోగిస్తుండగా- నాలుగు గదుల్లో చిన్నారులను కూర్చోబెడుతున్నారు. ఇక్కడ ఆరు అదనపు గదుల నిర్మాణం కోసం రూ. 1.36 కోట్లు కేటాయించగా.. రూ. 53 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు ప్రారంభించిన మూడు గదుల నిర్మాణం 80 శాతం పూర్తయ్యాయయి. తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో ఆగిపోయాయి. పాఠశాల ఆవరణలో ఇసుక, కంకర, ఇతర నిర్మాణ సామగ్రితో పాటు.. ఇరుకు గదులతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు.


మరుగుదొడ్లు కట్టలేరా ?

పాఠశాల విద్యార్థులకు మరుగుదొడ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. రెండే వినియోగంలో ఉన్నాయి. వీటికి క్యూ కట్టాల్సి వస్తోంది. గత ఏడాది నిర్మించిన మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకురావడం లేదు. ఇబ్బందులు పడుతున్నాం.

 సుమశ్రీ, 9వ తరగతి, కేఎన్‌ఆర్‌ స్కూల్‌


ఒక్కో గదిలో 60 మంది

ప్రస్తుతం ఉన్న తరగతి గదుల్లో దాదాపు 60 మంది కూర్చోవాల్సి వస్తోంది. మా పాఠశాలకు అనుమతించిన తరగతి గదులు అన్నీ పూర్తయితే తరగతికి సరిపడా విద్యార్థులు విశాలంగా కూర్చుంటాం. అప్పుడే ప్రశాంత వాతావరణం లభిస్తుంది. ప్రస్తుతం ఇరుకు గదుల్లోనే తరగతులు సాగుతున్నాయి.

షేక్‌ ఫజులుద్దీన్‌ 9వ తరగతి, ఈఎస్‌ఆర్‌ఎం స్కూల్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని