logo

గడప గడపన జగన్నాటకం!

అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం..

Published : 25 Apr 2024 03:31 IST

బిల్లుల చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం
ప్రతిపాదిత పనుల్లో సగానికి పైగా మొదలే కాని వైనం
ప్రచారంలో నిలదీస్తారని వైకాపా ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో గుబులు
ఈనాడు, నెల్లూరు

అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. పరిష్కారానికి కృషి చేయడం తదితరాలు చేయాలని నిర్ణయించింది. 2022, మే 11వ తేదీ కార్యక్రమం ప్రారంభం కాగా- ప్రతి వీధిలో సమస్యలు వెల్లువెత్తాయి. ప్రతిచోటా తమ ప్రాంతంలో కనీస సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్‌ వినిపించింది. మంచినీరు, రహదారులు, మురుగు కాలువల నిర్వహణ తీరుపై ఎక్కువగా నిలదీశారు. ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు అర్హులకు అందడం లేదన్న ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమైంది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు.. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చిన కరపత్రాలను పంపిణీ చేయడంతోనే సరిపెట్టారు. పలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా.. వాటిలో చాలా వాటి పరిస్థితి నేటికీ మారలేదు.

నాలుగేళ్లపాటు గ్రామ, పట్టణాలను ఎంతో నిర్లక్ష్యం చేసిన ముఖ్యమంత్రికి.. ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా ప్రజలు గుర్తొచ్చారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో వార్డు సచివాలయానికి రూ. 40 లక్షలు, గ్రామ సచివాలయానికి రూ. 20 లక్షల చొప్పున ఇస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. ఆ మేరకు నిధులు విడుదల చేశారా? పనులు పూర్తి చేయించారా? అంటే.. లేదనే సమాధానమే వస్తోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 688 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 5,734 పనులు గుర్తించారు. వాటికి రూ. 234 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఎక్కువ పనులను ఎమ్మెల్యేల సిఫార్సులపై నామినేషన్‌ పద్ధతిలో కేటాయించారు. కొన్ని ప్రాంతాల్లో టెండర్లు పిలవగా- గుత్తేదారుల నుంచి స్పందన లేదు. ఈ ప్రభుత్వంలో ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకే ఇంకా జిల్లా వ్యాప్తంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో.. కొత్తగా చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో 2,500 పనులు మాత్రమే పూర్తి చేశారు. దీనికి రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేయగా.. అందులో సుమారు రూ.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికీ పూర్తికాకపోవడంతో..

ఏడాది నుంచి పనులు చేపట్టినా.. అవి ఇప్పటికీ పూర్తికాకపోవడంతో.. ఆయా సమస్యల పరిష్కారానికి హామీలిచ్చిన వైకాపా ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో  ప్రస్తుతం గుబులు రేగుతోంది. చాలా సమస్యలు ప్రతిపాదించకపోవడం.. చేసిన వాటిలో సగం కూడా పూర్తికాకపోవడం.. చాలా అసంపూర్తిగా నిలిచిపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళ.. ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతాయేమోనని హడలిపోతున్నారు. అలాగే, గ్రామాల్లో ఎలాంటి పనులు చేయాలన్నా పంచాయతీల తీర్మానం అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ పథకంలో పనుల గుర్తింపు, నిధుల కేటాయింపునకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయడం, అందులో సర్పంచికి స్థానం లేకుండా చేయడం తదితరాలతో ఇప్పుడు స్థానిక నాయకులు ఎన్నికల్లో ఎంత మేరకు సహకరిస్తారోనన్న గుబులు నెలకొంది.


అనంతసాగరం: అనంతసాగరం ఎస్సీ కాలనీలోని కాలువలివి. ఏళ్ల కిందట నిర్మించినవి కావడంతో అధ్వానంగా మారాయి. ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు సక్రమంగా వెళ్లకపోవడంతో.. ఆ ప్రాంత వాసులు అవస్థలు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు, గడపగడపకు వచ్చిన ప్రజాప్రతినిధులకు విన్నవించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


కందుకూరు: కందుకూరు పట్టణం ఐ.ఎస్‌.రావు నగర్‌లోనిదీ చిత్రం. కాలువలు సక్రమంగా లేకపోవడంతో.. మురుగునీరు ఇలా ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలోకి చేరి దుర్వాసన వస్తోంది. దోమలకు ఆవాసంగా మారింది. వైకాపా అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో పట్టణంలో కనీస అభివృద్ధి లేదు. 17 సచివాలయాలు ఉండగా- ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే తిరిగితే రూ. 40 లక్షల వరకు ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి పర్యటించిన ప్రాంతాల్లో ప్రజల నుంచి నిలదీతలు ఎదురు కావడంతో కందుకూరులో ఒక్క వార్డు కూడా తిరగలేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


కోవూరు:  సెయింట్‌పాల్‌ స్కూల్‌ రోడ్డు. ఈ మార్గంలో నిత్యం రెండు వేల మంది విద్యార్థులు వెళుతుంటారు. దీంతో పాటు కోవూరు నుంచి ఇనమడుగు వెళ్లే ప్రధాన రహదారి. వర్షమొచ్చిందంటే చాలు.. ఆ రోడ్డంతా మురుగునీటితో నిండిపోతుంది. ఈ సమస్యపై స్థానికులు పంచాయతీ అధికారులు, పాలకులకు ఎన్నో సార్లు విన్నవించారు. పట్టించుకున్న పరిస్థితి లేదు. కనీసం గడప గడపకు మన ప్రభుత్వం నిధులతోనైనా చేస్తారనుకున్నా.. అడుగు పడలేదు.


జరిగిన అభివృద్ధి శూన్యం
- జి.వెంకట్రావు, కందుకూరు

గత అయిదేళ్లలో కందుకూరులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రోడ్లు, కాలువల నిర్మాణాన్ని సైతం గాలికి వదిలేశారు. పన్నులు కట్టించుకోవడంపై ఉన్న శ్రద్ధ.. మౌలిక సదుపాయాలపై లేదు. రోడ్లపై మురుగు తాండవిస్తోంది. చెత్తా చెదారంతో కాలువలు నిండి దుర్వాసన వస్తోంది. ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని