logo

పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్‌!

వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది.

Updated : 19 May 2024 06:49 IST

లబోదిబో అంటున్న లబ్ధిదారులు

వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. నిరుపేదలు కావడంతో అధికారులు, స్థానిక నాయకుల సూచన మేరకు ఇంటి నిర్మాణాన్ని గుత్తేదారుకు అప్పగించారు. ప్రభుత్వం ఇచ్చిన మొత్తం నగదు తీసుకున్న గుత్తేదారు.. లబ్ధిదారుల వద్ద రూ. 35వేలు అదనంగా వసూలు చేశారు. శ్లాబ్‌ వరకు నిర్మించారు. ప్రస్తుతం ఆ ఇంటి శ్లాబ్‌ చేతితో లాగితే ఊడి వస్తోంది. 

పది కాలాలు పదిలంగా ఉండేలా ఇళ్లు నిర్మించాల్సి ఉండగా- పేదల అవసరాలను ఆసరాగా తీసుకుని.. అధికారుల అండతో గుత్తేదారులు పేక మేడల్లా నిర్మించారు. తీరా వాటిని చూసిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పనులు పూర్తికాకముందే కూలిపోయేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. వెంకటాచలం మండలం కంటేపల్లిలో గుత్తేదారుడు నిర్మించిన ఇళ్లు అధికారుల పర్యవేక్షణ లేమికి.. గుత్తేదారుల అక్రమాలకు పరాకాష్ఠగా నిలిచాయి. 

వెంకటాచలం, మనుబోలు, న్యూస్‌టుడే: వెంకటాచలం మండలం కంటేపల్లిలో వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీ ఏర్పాటు చేసి.. స్థలాలు మంజూరు చేసింది. లబ్ధిదారుల్లో అత్యధికులు నిరుపేదలు కావడంతో ఇళ్లు నిర్మించుకోలేదు. దీంతో అధికారులు, స్థానిక నాయకుల సూచనలతో ఇళ్ల నిర్మాణ బాధ్యతను ఓ గుత్తేదారుకు అప్పగించారు. సదరు వ్యక్తి సుమారు వంద గృహాల వరకు నిర్మించేందుకు ముందుకొచ్చారు. శ్లాబ్‌ వరకు నిర్మిస్తే.. ప్రభుత్వం ఇచ్చే మొత్తం నగదుతో పాటు అదనంగా రూ. 35వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 40కిపైగా ఇళ్లకు నెల కిందట శ్లాబ్‌ పూర్తి చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన నగదుతో పాటు లబ్ధిదారుల వద్ద నగదు తీసుకున్నారు. ఈ విషయంలో అధికారులు గుత్తేదారుకు పూర్తిగా సహకరించారు. 

కంగుతిన్న లబ్ధిదారులు.. గ్రామానికి చెందిన లబ్ధిదారు అద్దూరు కామాక్షి భర్త శేషు.. తమ ఇంటికి అదనంగా మెట్లు నిర్మించుకోవాలని శనివారం పనులు ప్రారంభించారు. అందుకోసం కొంత వరకు శ్లాబ్‌ తొలగించాల్సి రావడంతో.. మిషన్‌ తెప్పించారు. ఈ లోపు పైకి ఎక్కి శ్లాబ్‌కు ఉన్న మట్టిని చేత్తో తొలగించే ప్రయత్నం చేయగా.. శ్లాబ్‌ కూడా ఊడి వచ్చింది. అనుమానం వచ్చి మరొక చోట చేతితో కొట్టగా ఊడిపోయింది. దాంతో కంగుతినడం ఆయన వంతైంది. 

గుత్తేదారు నాసిరకంగా నిర్మించిన ఇల్లు

వర్షం వస్తే.. కూలేలా..

ఇసుక, బూడిద, కంకర, అతి తక్కువ సిమెంట్‌ వేసి.. శ్లాబ్‌ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. గుత్తేదారు 30కిపైగా ఇళ్లు నిర్మించినా.. నేటికీ లబ్ధిదారులు ఎవరూ పరిశీలించలేదు. శనివారం వెలుగు చూసిన సంఘటనతో.. మిగిలిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమ ఇళ్ల నాణ్యతపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్లాబే ఇంత నాసిరకంగా ఉంటే.. గోడల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

గుత్తేదారులకు అధికారుల వత్తాసు

గృహాలను.. అత్యంత నాసిరకంగా నిర్మించగా.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. గుత్తేదారుకే వత్తాసు పలుకుతున్నారు. నిర్మాణాల నాణ్యతను పరిశీలించకుండానే.. బిల్లులు ఇవ్వడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇళ్లు కట్టుకోకపోతే ప్లాట్లు రద్దు చేస్తామని చెప్పి వైకాపా నాయకులు, గృహ నిర్మాణశాఖ అధికారులు బలవంతంగా గుత్తేదారుకు అప్పగించారని వారు వాపోతున్నారు. వెంకటాచలం మండలంలోని మరో అయిదు గ్రామాల్లోనూ గుత్తేదారులు 300కుపైగా ఇళ్లు నిర్మించారు. వాటి నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులు విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

‘తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో వైకాపా నాయకులే గుత్తేదారులుగా మారి గిరిజనుల ఇళ్లు నిర్మించారు. ఆ క్రమంలో నాణ్యతకు పాతరేయగా.. కాలితో తన్నితే గోడలు పడిపోతున్నాయి. మనుబోలు జగనన్న కాలనీలో గిరిజనులకు గృహాలు నిర్మిస్తామని చెప్పి.. నగదు తీసుకుని గుత్తేదారుడు పత్తాలేకుండా పోయారు. లబ్ధిదారులు సదరు వ్యక్తిపై కేసులు కూడా పెట్టారు.’


నిర్మాణాలు పరిశీలిస్తాం

వైకాపా నాయకుల సిఫార్సుతో కంటేపల్లి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను గుత్తేదారుడికి అప్పగించాం. కొన్ని పూర్తి చేశారు. గుత్తేదారుడు పటిష్ఠంగానే నిర్మించారని అనుకున్నాం. నాసిరకం నిర్మాణాలపై ఫిర్యాదు చేయలేదు. వాటిని పరిశీలిస్తాం.  

వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ ఏఈ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని