logo

పేరుకే రైతు భరోసా

అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ఉద్దేశించిన రైతు భరోసా కేంద్రాలు ఆచరణలో నిరాశ కలిగిస్తున్నాయి. త్వరలో ఖరీఫ్‌ సీˆజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులకు సరైన ప్రణాళికలు లేవనే విమర్శలు వస్తున్నాయి.

Published : 25 May 2024 02:43 IST

సేవల్లో నిరాశ 
ఆర్బీకేల తీరు

కలిగిరిలో అసంపూర్తిగా ఆర్బీకే భవనం

అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ఉద్దేశించిన రైతు భరోసా కేంద్రాలు ఆచరణలో నిరాశ కలిగిస్తున్నాయి. త్వరలో ఖరీఫ్‌ సీˆజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులకు సరైన ప్రణాళికలు లేవనే విమర్శలు వస్తున్నాయి. సాగు ప్రోత్సాహకాల్లో కోత తదితర చర్యలతో ఇంకెన్ని అవస్థలు పడాల్సి వస్తోందోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

దుత్తలూరు, న్యూస్‌టుడే : అన్నదాతకు అవసరమైన అన్ని సేవలు రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకేలు) ద్వారానే అందిస్తామని ప్రారంభంలో పాలకులు ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 37 మండలాల పరిధిలో 561 రైతు భరోసా కేంద్రాలున్నాయి. ఏటా ఖరీఫ్‌లో 59 వేల హెక్టార్లకుపైగా రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు.

  • యంత్రసేవ పథకంలో భాగంగా జిల్లాలోని 614 రైతు బృందాలకు రూ. 66.40 కోట్ల వ్యయంతో 4,314 వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. ఆర్బీకే పరిధిలో అయిదుగురు వంతున రైతు బృందాలకు ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వేస్టర్లు, రొటోవేటర్లు, వరినాట్లు, దుక్కి, కోత, నూర్పిడి యంత్రాలు అందజేశారు. యంత్రాలు తీసుకున్న రైతులు వారి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుని... ఆపై అవసరార్థులకు నామమాత్రపు నగదు తీసుకుని పనులు చేయాలి. క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలుకావటంలేదు.
  • ఆర్బీకేల పరిధిలో ఎన్ని యంత్రాలు ఉన్నాయి. వాటిని ఎంతమంది వినియోగించాలి... ఏఏ పనులకు ఎంత నగదు వసూలు చేయాలనే అంశాలను అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో ఈ పథక లక్ష్యం పూర్తిగా దారి తప్పింది. యంత్ర సేవా పథకం వైకాపా అనుయాయులకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి.
  • ఆర్బీకేల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఈ క్రమంలో రైతులకు సకాలంలో సాగు సలహాలు, సూచనలపై సరైన సమాధానం లేదని రైతులు విమర్శిస్తున్నారు.
  • తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతి సీˆజన్‌లో పొలంబడి నిర్వహించారు. రైతులకు వ్యవసాయాధికారులు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ప్రతి వేసవి కాలంలో మట్టి నమూనాలు సేకరించి రైతులకు వివరించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని వైఎస్‌ఆర్‌ పొలంబడిగా మార్చారు. ఇదే సందర్భంలో నిధులకు మంగళం పాడారు. ఫలితంగా గ్రామాల్లో పొలంబడి కార్యక్రమాలు పూర్తిగా అటకెక్కాయి.

నామమాత్రమే

- చంద్రశేఖర్, రైతు, వరికుంటపాడు 

రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు లభిస్తామని అధికారులతోపాటు ప్రభుత్వం పేర్కొంది. క్రమంగా ఈ కేంద్రాల్లో అరకొరగానే సేవలు అందుతున్నాయి. రాయితీపై అందజేసిన వ్యవసాయ పరికరాలు సామాన్య రైతులకు అందుబాటులో ఉండటంలేదు. అధిక ధరలు వెచ్చించి బయట నుంచి బాడుగకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు ఎంతో ఉపయోగ పడే పొలంబడి కార్యక్రమాన్ని పూర్తిగా అటకెక్కించారు. రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో సూచనలు, సలహాలు అందటం గగనంగా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు