logo

కూర‘గాయాలు’

ఏం కొనలేం.. ఏం తినలేం అన్నట్లుంది.. సామాన్యుడి పరిస్థితి. మాంసం చేపల ధరలు పెరిగి పోవడంతో శాఖాహారిగా మారుతున్నారు. చివరకు కూరగాయల ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి. కిలో చికెన్‌ ధర రూ.300పైనే ఉంది. మటన్‌ ధర రూ.800 వరకు పలుకుతోంది.

Updated : 25 May 2024 06:33 IST

ఆకాశాన్నంటుతున్న ధరలు
నెలలోనే ఎంతో వ్యత్యాసం

కూరగాయలు 

న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ): ఏం కొనలేం.. ఏం తినలేం అన్నట్లుంది.. సామాన్యుడి పరిస్థితి. మాంసం చేపల ధరలు పెరిగి పోవడంతో శాఖాహారిగా మారుతున్నారు. చివరకు కూరగాయల ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి. కిలో చికెన్‌ ధర రూ.300పైనే ఉంది. మటన్‌ ధర రూ.800 వరకు పలుకుతోంది. రెండింటి ధరలు పెరగడంతో మాంసాహారులు చేపల కొనుగోలుపై దృష్టి సారించారు. వాటి ధర కూడా కిలో రూ.150 పేనే పలుకుతోంది. ఇలా అన్ని ధరలు పెరగడంతో ఎక్కువ మంది కూరగాయల కొనుగోలు చేస్తున్నారు. ఈనెల మధ్య నుంచి వాటి ధరలు  అమాంతం పెరిగిపోయాయి.

  • గతనెలకు ఈనెలకు ఎంతో వ్యత్యాసం ఉంది. కొన్ని సగానికి సగం పెరిగిపోయాయి. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్‌కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం దాదాపుగా రూ.కోటి వరకు వ్యాపారం జరుగుతుంది. ఇక్కడకు జిల్లా నలుమూలల నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. అలాంటి ప్రధాన మార్కెట్‌లోనే ధరలు పెరిగిపోతున్నాయి. మార్కెట్‌కు రాలేక సామాన్యులు తమ వీధుల్లో కూరగాయలు కొందామంటే రెండింతలు పెంచి అమ్ముతున్నారు.

ఎండల ప్రభావంతో..

ఎండల ప్రభావంతో ధరలు పెరిగిపోతున్నాయి. పంటలు సరిగా పండక దిగుబడులు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్‌కు రావడం లేదు. అందువల్ల కూరగాయల ధరలు టోకు వ్యాపారుల వద్దే పెరిగినట్లు చిల్లర వర్తకులు తెలుపుతున్నారు. ఎండాకాలం కూలీల రేట్లు, రవాణా ఖర్చు పెరగటం వంటి కారణాలతో ధరలు పుంజుకున్నాయని వ్యాపారులంటున్నారు. 

కొత్తిమీర రూ.40

చివరకు కొత్తిమీర కట్ట ఒక్కొక్కటి రూ.40కి అమ్ముతున్నారు. బీన్స్‌ రూ.120 వరకు ధర పలుకుతోంది. కోలార్‌ నుంచి బీన్స్, క్యారెట్, కొత్తిమీర తదితర కూరగాయలు ఇక్కడకు వస్తుంటాయి. చివరకు కరివేపాకు కూడా రూ.5కు ఇవ్వడం లేదు. ఇటీవల వరకు కిలో రూ.10 వంతున అమ్మే టమటాలు సైతం రూ.35 పలుకుతున్నాయి. జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పచ్చిమిర్చి కిలో రూ.70 వరకు పలుకుతోంది. పందిరి చిక్కుళ్లు సగభాగం అంగళ్లు అమ్మడం లేదు. ఒకరిద్దరు తెప్పిస్తున్నా, వాళ్లూ కిలో రూ.80కు పైనే అమ్ముతున్నారు.

ఇంతగా ఎప్పుడూ పెరగలేదు: 

బుజ్జమ్మ

ఇటీవలకాలంలో ఇంతగా కూరగాయల ధరలు పెరగడం ఎప్పుడూ జరగలేదు. మార్కెట్‌కు రావాలంటే భయమేస్తోంది. మిర్చి నుంచి అన్నీ ధరలు పెరిగిపోయాయి.

వీధుల్లో ఇంకా ఎక్కువ 

వెంకటేశ్వర్లు

మార్కెట్‌లో కొనుగోలు చేసి ఎక్కువ ధరలతో ఇష్టానుసారంగా స్థానిక వీధుల్లో అమ్ముతున్నారు. ఇలాగైతే సామాన్యులు బతకడం కష్టమే. కిలోకు బదులు పావు కిలో కొంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని