logo

ఉలవపాడు మామిడి.. విదేశాలకు ఎగుమతి

ఉలవపాడు మామిడికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి రకానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇంతటి పేరున్నా.. గత కొన్నేళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెగుళ్లకు తోడు.. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దిగుబడులు సగానికిపైగా తగ్గిపోయాయి.

Published : 25 May 2024 03:01 IST

బంగినపల్లికి మంచి గిరాకీ 

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: ఉలవపాడు మామిడికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి రకానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇంతటి పేరున్నా.. గత కొన్నేళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెగుళ్లకు తోడు.. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దిగుబడులు సగానికిపైగా తగ్గిపోయాయి. పోనీ.. వచ్చిన పంటైనా సకాలంలో.. సక్రమంగా అమ్ముకునేందుకు అవకాశం ఉందా? అంటే.. సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేక రైతులు ఇబ్బంది పడుతున్న దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో  కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యానశాఖ ద్వారా రైతులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించగా.. కొందరు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. తాము ఆదాయం పొందడంతో పాటు మరో పది మందికి ఉపాధి చూపుతూ ఇతరులకూ మార్గదర్శకంగా నిలుస్తున్నారు. 

కాయలను ట్రేల్లో సర్దుతూ.. 

నాణ్యతను ధ్రువీకరించి..

కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో సుమారు పదివేల ఎకరాలు, గుడ్లూరులో 3వేలు, కందుకూరు, వలేటివారిపాలెం మండలాల్లో వేయి ఎకరాల్లో మామిడి సాగవుతుందని అంచనా. ఇక్కడ బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, నీలం, కొబ్బరి మామిడి, పునారస్, హిమామ్‌ పసంద్‌ తదితర రకాలు సాగవుతాయి. వచ్చిన దిగుబడులను ప్రతి వేసవిలో 16వ నంబరు జాతీయ రహదారి వెంబడి దుకాణాలు ఏర్పాటు చేసి.. విక్రయిస్తుంటారు. ఉలవపాడులో జరిగే బహిరంగ మార్కెట్‌లోనూ అమ్మకాలు చేస్తుండగా- ఇక్కడి నుంచి ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, గుంటూరు, దిల్లీ, హరియాణ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ క్రమంలో రైతుల కష్టం దళారులపాలవుతోందని గుర్తించిన కేంద్రం.. ఉద్యానశాఖ ద్వారా నేరుగా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. దీనికి ముందుగా పొలం పాసుపుస్తకం, ఆధార్‌ కార్డుతో అధికారులను సంప్రదిస్తే.. అగ్రికల్చర్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అథారిటీ(అపెడా)లో రైతు వివరాలు నమోదు చేస్తారు. విదేశాలకు ఎగుమతి చేయాలంటే.. ముందుగా నాణ్యమైన కాయలను ఎంచుకుని.. వాటిని బెంగళూరు సమీపంలోని మాలూరు ఇన్నోవా ఫుడ్‌ పార్కుకు పంపాలి. అక్కడ ‘గామా’ కిరణాలతో(ఇర్రేడియేషన్‌) పరీక్షలు జరిపి, నాణ్యమైనవిగా ధ్రువీకరించిన తర్వాత విదేశీ ఏజెంట్ల ద్వారా అమెరికా, కెనడా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఈ ఏడాది ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు చెందిన సుమారు 350 మంది రైతులు అంపెడాలో వివరాలు నమోదు చేయించుకున్నారు. 

ఇక్కడి కాయలకు.

బ్రహ్మసాయి, ఉద్యానశాఖ అధికారి, కందుకూరు

మామిడిలో పూత, పిందె దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం చాలా అవసరం. కాయ నిమ్మ పరిమాణంలో ఉన్నప్పుడు ఫ్రూట్‌ కవర్లు తొడగడం ఎంతో మేలు చేస్తుంది. తెగుళ్లు, పండుఈగ, మంచు తదితరాల నుంచి రక్షణ లభిస్తుంది. కాయ కోసే నాలుగు రోజుల ముందు కవర్లు తొలగిస్తే.. రుచి బాగుంటుంది. నాణ్యమైన కాయలకు మంచి గిరాకీ ఉంది. అవి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

భీమవరం నుంచి అమెరికాకు

ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన డి.శ్రీనివాసరాజు ఇటీవల సుమారు 12 టన్నుల కాయలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాలూరులోని ఇన్నోవా ఫుడ్‌పార్కుకు విక్రయించారు. డిగ్రీ పూర్తి చేసిన ఈయనది.. వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి తండ్రి, తాతలను చూసి సాగుపై మక్కువ పెంచుకున్నారు. వ్యవసాయ పనులు చేస్తూనే డిగ్రీ పూర్తి చేశారు. నాలుగు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం లాభసాటిగా లేదని.. డిగ్రీ పూర్తయిన అనంతరం విజయవాడలో కంప్యూటర్స్‌ హార్డ్‌వేర్‌ విభాగంలో ఉద్యోగిగా చేరారు. 20 ఏళ్లపాటు అదే ఉద్యోగిగా కొనసాగారు. ఆ క్రమంలో ప్రతి వేసవిలో వచ్చే మామిడి కాయలను స్వగ్రామం నుంచి తీసుకువెళ్లి.. అక్కడ తనకు తెలిసిన వారికి ఇచ్చేవారు. రెండేళ్ల కిందట ఉలవపాడు మామిడిని ఎలాగైనా.. ఇతర దేశాలకు పంపాలని లక్ష్యంగా పెట్టుకుని.. ఉద్యోగం వదిలేసి.. స్వగ్రామానికి వచ్చారు. అంపెడాలోని ఆర్చెడ్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. నాణ్యమైన కాయలను సేకరించి.. గత ఏడాది ఎనిమిది, ఈ ఏడాది 12 టన్నులు మాలూరు హౌస్‌కు పంపారు. అక్కడి నుంచి ఏజెంట్ల ద్వారా అమెరికాకు ఎగుమతి అయ్యాయి. రాబోయే రోజుల్లో విదేశాలకు తానే నేరుగా ఎగుమతి చేసేందుకు కృషి చేస్తానని ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం కొంత ఆదాయం పొందడంతో పాటు మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని