logo

జల్‌జీవన్‌ పనులు నిలిచెన్‌!

అనంతసాగరం మండలం సోమశిలలో మొత్తం 19 పనులు మంజూరు కాగా.. రెండే పూర్తయ్యాయి. వీటికి సంబంధించి.. రూ.40 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. రూ. 4 కోట్ల విలువైన 17 ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.

Published : 25 May 2024 03:05 IST

అసంపూర్తిగానే ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు

 

అనంతసాగరం మండలం సోమశిలలో మొత్తం 19 పనులు మంజూరు కాగా.. రెండే పూర్తయ్యాయి. వీటికి సంబంధించి.. రూ.40 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. రూ. 4 కోట్ల విలువైన 17 ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. 

గుడ్లూరు మండలం స్వర్ణాజీపురంలో రూ. 8 లక్షలతో జల్‌జీవన్‌ మిషన్‌ పనులు ప్రారంభించారు. పైప్‌లైన్‌ వేసేందుకు కొంత వరకు గుంత తీశారు. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం రోడ్డు పక్కన గుంతలు అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయి. 

గ్రామీణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇస్తున్నామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం- కనీ సం సగం పనులు పూర్తి చేయలేదు. 
రూ. కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా.. చేసిన పనులకూ బిల్లులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా చిన్న గుత్తేదారులను గాలికొదిలేసి.. దొరికిన కాడికి దోచుకునేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే వీరి బిల్లులు అప్‌లోడ్‌ చేయకపోవడంతో పాటు ఇప్పటికే చేసిన వాటిని తిరస్కరిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా జల్‌జీవన్‌ మిషన్‌ పనులను నిలిపివేయాలని గుత్తేదారులు నిర్ణయించడం గమనార్హం. 

ఈనాడు, నెల్లూరు: జడ్పీ, అనంతసాగరం, గుడ్లూరు, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ‘జల్‌ జీవన్‌ మిషన్‌(జేఎంఎం) పథకాన్ని 2019లో అమల్లోకి తీసుకొచ్చారు. 2024 నాటికి పనులు పూర్తి చేసి నీరందించేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే రక్షిత పథకాల నుంచి కొత్త పైప్‌లైన్లు వేసి.. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం పనులు.. నాలుగేళ్లపాటు విడతల వారీగా పూర్తి చేయాలన్నది ప్రణాళిక. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పురోగతి ఆశించిన స్థాయిలో లేదు. ఫలితంగా మార్చి 2024 నాటికి పూర్తి చేసి తాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం నీరుగారింది. ఇప్పటికే ప్రారంభించిన పనులు నత్తనడకన సాగుతుండగా.. కొత్తగా టెండరు పిలుస్తున్నా కొన్నిటికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. కొందరు అప్పులు తెచ్చి మరీ పనులు చేశామని.. బిల్లులు చెల్లిస్తేనే కొత్తవి చేస్తామని చెబుతుండటంతో అధికారులు సైతం ఏమీ మాట్లాడలేకపోతున్నారు.

పాత కుళాయిలే.. కొత్త లెక్క

ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 5.61 లక్షల ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 మార్చి నాటికి వీటిలో అయిదు లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా 60,203 ఇవ్వాల్సి ఉందని చెబుతున్నా.. జిల్లాలో మంజూరు చేసిన పనుల్లో సగం పూర్తి కాకుండానే.. ఇన్ని ఎలా ఇచ్చారన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి ప్రతి గ్రామంలో చాలా వరకు ఇళ్లకు కుళాయి కనెక్షన్లు గతంలోనే ఉన్నాయి. ప్రస్తుతం వాటికి పైప్‌లైన్‌ కనెక్షన్లు ఇచ్చి.. అవన్నీ జల్‌జీవన్‌ మిషన్‌లో భాగంగా ఇచ్చినట్లు చెబుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 4006 పనులు మంజూరు కాగా.. వీటి విలువ రూ. 690.29 కోట్లుగా అంచనా వేశారు. నాలుగేళ్లలో 1,463 మాత్రమే పూర్తి చేశారు. ఇందుకోసం రూ. 111.47 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు టెండర్లు పిలవని 1682 పనులను కమ్యూనిటీ కాంట్రాక్టింగ్‌ సిస్టం ద్వారా చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 

రూ. 15 కోట్ల బకాయిలు

పథకానికి వెచ్చిస్తున్న నిధుల్లో 50 శాతం కేంద్రం భరిస్తుండగా- 50 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ. 5 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 2కోట్లు, రూ. 2 కోట్లపైగా విలువైనవిగా విడగొట్టి టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. విలువను బట్టి డివిజన్, సర్కిల్‌ కార్యాలయాల్లో టెండర్లు పిలిచి ఆమోదిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. మండలాల వారీగా ఇదే పరిస్థితి ఉండటంతో.. పనుల వారీగా టెండర్లు పిలిచి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. కేంద్ర భాగస్వామ్యం ఉండటంతో బిల్లులు వస్తాయన్న ఉద్దేశంతో.. మొదట్లో పనులు వేగంగా ప్రారంభించారు. అవి కాస్త ఆలస్యం కావడంతో.. వెనకడుగువేశారు. చివరకు వైకాపా నాయకులకు అప్పగించారు. బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి.. పలు ప్రాంతాల్లో చేయించారు. ప్రస్తుతం జిల్లాలో రూ. 15 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉండగా.. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు బిల్లులను తిరస్కరిస్తున్నారు. పైగా సమయం దాటిన తర్వాత అప్‌లోడ్‌ చేశామని చెబుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ పనులు చేస్తే.. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని ఆవేదన చెందుతున్నారు. బిల్లులు చెల్లించే వరకు పనులు చేయమని నిర్ణయించారు. 

త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు 

మర్దనాలి, ఇన్‌ఛార్జి ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌ 

జల్‌జీవన్‌ మిషన్‌ పనులు ఇప్పటి వరకు ఎక్కడా అగలేదు. నిధానంగా జరుగుతున్నాయి. బిల్లుల బకాయిల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. చిన్నగుత్తేదారులకు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం లేదు. ఎన్నికల కోడ్‌ కారణంగా కొత్తవి ప్రారంభించలేదు. వీలైనంత త్వరగా పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని